ఆనాడు పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసి మరీ విభజన బిల్లుని ఆమోదింపజేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏపికి ప్రత్యేక హోదా కోసమని రాజ్యసభని స్తంభిపజేస్తుండటం ఒక విశేషమనుకొంటే, ఆనాడు ఏపికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన భాజపా మొన్న ఆ బిల్లుపై ఓటింగ్ జరుగవలసిన సమయంలో సభలో నానా రభస చేసి తప్పించుకోవడం మరో విశేషం. ఆనాడు సభలో అంత రభస చేసిన భాజపా సభ్యులు ఇప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చొంటున్నారు.
ఆ బిల్లుపై ఓటింగ్ జరుగకుండా అడ్డుకోనేందుకే ఆనాడు భాజపా సభ్యులు సభలో రభస చేసి, సభని వాయిదాపడేలా చేశారని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోరుతూ కెవిపి రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించేవరకు సభా కార్యక్రమాలని అడ్డుకొంటామని ఆయన చెప్పారు. “రాజ్యసభ సంప్రదాయం ప్రకారం ప్రైవేట్ బిల్లులని, తీర్మానాలని రెండువారాలకి ఒకసారి శుక్రవారంనాడు మాత్రమే అనుమతిస్తాము కనుక ఆగస్ట్ 5న మళ్ళీ ఆ బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తానని” రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ హామీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళన విరమించలేదు.
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదని కేంద్రప్రభుత్వం ఎప్పుడో స్పష్టం చేసింది. మాట తప్పిన దాని గురించి ఇప్పుడు ఆలోచించనవసరం లేదు. ఎన్నికలప్పుడు ఆలోచిస్తే సరిపోతుంది. రెండేళ్ళలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఏపి కోసం ఇంత గట్టిగా పోరాడలేదు. కానీ రాష్ట్రంలోలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొన్నప్పటి నుంచి, ఈ అంశంపై గట్టిగా పోరాడుతోంది. రాజ్యసభలో కాంగ్రెస్, భాజపాలు ఆడుతున్న ఈ డ్రామాని చూస్తే ఆ రెండు పార్టీలకి రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అర్ధమవుతుంది.