జులై 8నఓ ఎన్కౌంటర్లో హిజ్బుల్‌కు చెందిన కమాండర్ బుర్హాన్ వనీ(22) మృతి చెందిన అనంతరం కాశ్మీర్లోమొదలైన హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటికి 47 మందికి పైగా చనిపోగా 3,400 మందికి పైగా గాయపడ్డారు.
కాశ్మీర్ మళ్లీ మండుతోంది. ఇలా ప్రజల ఆగ్రహావేశాలు బద్దలు కావడం మొదటిసారేమీ కాదు. అయితే ఈసారి జరుగుతున్న నిరసన ప్రదర్శనలు చాలా విస్తృతమైనవి. ఇది వారిలో గూడుకట్టుకున్న పరాయీకరణ భావనకు ప్రతిబింబమే. ప్రస్తుత పరిస్థితి 1990వ దశకం నాటి పరిస్థితి లాగే ఉంది. 25 ఏళ్ళు దాటినా ప్రజలలో తొలగని నిరాశకు, వారి గాయపడ్డ మనోభావాలకు ఇదొక సంకేతం. వారు భద్రతా బలగాలను పీడించేవారిగానే చూస్తున్నారు.
కాశ్మీర్ సమస్యను వరుసగా నిర్లక్ష్యం చేస్తున్నందు వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజల్లో నెలకొన్న పరాయీకరణ భావనలను దూరం చేయడానికి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు పెద్దగా చేసిందేమీ లేదు. 1990 ల్లో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు సమస్య పరిష్కారానికి స్వయంప్రతిపత్తి హామీనిచ్చారు. జరిగింది శూన్యం. తర్వాత దేవెగౌడ నేతృత్వంలో ఏర్పాటైన యూడీఎఫ్ ప్రభుత్వం తన కనీస ఉమ్మడి కార్యక్రమంలో ‘గరిష్ట స్వయంప్రతిపత్తి’ ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదించిన స్వయంప్రతిపత్తి తీర్మానం కనీసం పార్లమెంటు పరిశీలనకైనా వెళ్ళలేదు. 2010లో అశాంతి నెలకొన్న సమయంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. కానీ దాని సూచనల అమలుకు ఏచర్యలూ లేవు.పలు సందర్భాల్లో కాశ్మీరీలతో చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తులను, కమిటీలను నియమించారు. పంత్ కమిటీ, వోహ్రా కమిటీ, పడ్గాంవ్కర్ కమిటీ వగైరా, వగైరా. కానీ ఈ కమిటీల రిపోర్టు లేవీ పార్లమెంటుకు రాలేదు.
కేంద్రంలోమోదీ ప్రభుత్వం వచ్చాక ఉంది. దేశమంతటా మైనారిటీలపై వేధింపులు, అణచి వేతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం కాశ్మీరీ ముస్లింల మనస్సులపై ఉంది. 2014 చివరలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పీడీపీ, బీజేపీలు రెండూ మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ పరస్పరం దుమెత్తి పోసుకున్నాయి. కానీ ఎన్నికలు ముగిశాక అవి రెండూ యూ-టర్న్ తీసుకొని పొత్తు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ పరిణామం రాష్ట్రంలో అప్పటికే నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితిని మరింత తీవ్రం చేసింది.
కాశ్మీరీ సమస్య పట్ల మోడీ ప్రభుత్వ వైఖరి గురించి చెప్పాలంటే ఒక్క విషయం సరిపోతుంది. 2015లో శ్రీనగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో మోడీ అప్పటి సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్‌ను సభాముఖంగా ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉంది కాబట్టి పాకిస్తాన్‌తో చర్చలకు, జమ్మూ కాశ్మీర్లో అన్ని రకాల అభిప్రాయాల వారితో సంభాషణలకు ఇదే మంచి అదను అని సయీద్ అంతకు ముందు నొక్కి చెప్పారు. అయితే, తనకు కాశ్మీర్ గురించి అంతా తెలుసనీ, ఏం చేయాలో తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదనీ అంటూ మోడీ ఆయన సలహాను బహిరంగంగా తోసిపుచ్చారు. సహజంగానే కాశ్మీరీ ప్రజలు దీన్ని తమకు జరిగిన అవమానంగా భావించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు, ముఖ్యంగా యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.దీన్నిబట్టి మిలిటెన్సీ స్థాయి, మిలిటెంటు కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని భావించారు. అయితే మిలిటెన్సీ ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. కొత్త మిలిటెంట్లందరూ బాగా విద్యావంతులైన యువకులు. బుర్హాన్ వానీ అంత్యక్రియల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు మిలిటెంట్లు చనిపోయినప్పుడు వారి అంత్యక్రియలకు జనం ఇంతగా వచ్చేవారు కాదు. కానీ పరిస్థితి వేగంగా మారిపోతోంది. యువకులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వస్తున్నారు. వారిప్పుడు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి రాళ్లు రువ్వడం వరకే పరిమితం కావడం లేదు. వారు ప్రధానంగా రాళ్లతోనే అయినా పోలీసు, తదితర భద్రతా బలగాల క్యాంపులపై, పికెట్లపై దాడి చేసేందుకు సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి నిరసనకారులపై జరిగిన కాల్పుల్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. అంతే కాదు, మిలిటెంట్లతో ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు కూడా స్థానిక ప్రజలు, ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరిపోయి నిరసన తెలుపుతున్నారు. భద్రతా బలగాలపై రాళ్లు విసురుతున్నారు.
మిలిటెంట్ పోరాటాలవైపు కాశ్మీరీ యువకుల్ని ఆకర్షించడం కోసం నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ మరోసారి పోస్టర్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తాజాగా హిజ్బుల్ ప్రచారంలో పెట్టిన పోస్టర్లో ఏకే-47లు ధరించిన 11మంది మిలిటెంట్లు కనిపిస్తున్నారు. శత్రువుపై మేం మా యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ పోస్టర్‌పై ఉర్దూలో నినాదాలు రాశారు. రెండేండ్ల క్రితం బుర్హాన్ వనీ తన 10మంది సహచరులతో కలిసి హిజ్బుల్‌లో చేరినపుడు సోషల్ మీడియాలో ప్రచారం కోసం పెట్టిన ఫోటోను ఇది పోలి ఉన్నదని పరిశీలకులు చెబుతున్నారు. అయితే,బుర్హాన్ ఫోటోలోని యువకులు జీవం ఉట్టిపడేలా కనిపించేవారని, ఇందులో అది లోపించిం దని ఓ పోలీస్ అధికారి వ్యాఖ్యానిం చారు. మొత్తానికి ఈ కొత్త తరం ప్రచారం హిజ్బుల్‌కు చెందిన పాత మిలిటెంట్ల ముసుగులు ధరించి ముఖాలు దాచుకునేదానికి భిన్నమని పరిశీలకులు భావిస్తున్నారు.
గత 25 ఏండ్లలో పూర్తిగా కొత్త తరం ముందుకు వచ్చింది. అయినా ‘ఆజాదీ’ లేదా స్వతంత్ర కాశ్మీర్ అనే నినాదానికి ప్రజాకర్షణ ఇంకా ఉంది. అదే సమయంలో ఇస్లామీకరణ క్రమం కూడా కొనసాగుతోంది. పాకిస్తాన్ పట్ల ఆరాధన కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ధోరణి అంతగా లేదు. మిలిటెంట్లకు ఇప్పుడు విస్తృత మద్దతు ఉంది. బుర్హాన్ వానీ హత్యతో కాశ్మీర్ అంతటా కలకలం మొదలైంది. అన్ని సెక్షన్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ నిరసనలకు దక్షిణ కాశ్మీర్ కేంద్రంలా మారింది. పాలక పక్షమైన పీడీపీకి కూడా కాశ్మీర్‌లోని ఈ భాగంలోనే ప్రజాపునాది బలంగా వుండేది.
కానీ ఇప్పుడు ప్రజలు పీడీపీ పట్ల పూర్తి అసంతృప్తి చెందారన్నది స్పష్టం. బీజేపీతో దాని అపవిత్ర కూటమి పట్ల ద్వేషం కూడా ఈ అసంతృప్తికి ఓ కారణంగా ఉంది. పెద్ద పెద్ద మార్పులు తెస్తామన్న హామీలన్నీ బుట్టదాఖలయ్యాయి. ప్రజలకు సానుకూల మార్పు ఎక్కడా కనిపించడం లేదు.
అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కనిపించడం లేదు. అది నియంత్రించే స్థితిలో ఏ మాత్రం లేదు. ముఖ్యమంత్రి మెహబూబాకు దీనిపై పెదవి విప్పడానికి, శాంతిని నెలకొల్పాలని విజ్ఞప్తి చేయడానికి పూర్తిగా ఐదు రోజులు పట్టింది. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ఆమెకు ఇంకా ఎక్కువ రోజులే పట్టింది. కాశ్మీర్ లోయలో వార్తాపత్రికలపై నిషేధం విధించిన తర్వాత మూడు రోజులకు దీనిపై ముఖ్యమంత్రికి ఎలాంటి సమాచారం లేదని ఆమె మీడియా సలహాదారు వెల్లడించడాన్ని బట్టి ఆమె పాత్ర పరిమితులేమిటో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత సంక్షోభం నుంచి బైటపడడానికి ఏకైక మార్గం చర్చలేననేది సుస్పష్టం. చర్చలో జాతీయ స్థాయిలోని వివిధ పార్టీలతో పాటు రాష్ట్ర స్థాయిలోని సంబంధిత పక్షాలన్నింటినీ భాగం చేయాలి. తాము ఆక్రమణలో ఉన్నామని, తమపై వివక్ష అమలవు తోందని భావిస్తున్న కాశ్మీరీలను శాంతింపజేయాల్సిన అవసరం ఉంది. దాని కోసం పటిష్టమైన, సృజనాత్మకమైన ప్రయత్నాలు అవసరం. కానీ దురదృష్టవశాత్తు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. హింస చెలరేగి 16 రోజులు దాటినప్పటికీ ప్రధాని మోడీ ఏమీ మాట్లాడకపోవడం ఇందుకు ఒక ఉదాహరణ.