తెలంగాణాలో తెరాస, ఏపిలో తెదేపాలు భాజపాతో కత్తులు దూస్తుంటాయి. కానీ డిల్లీ పెద్దలతో మాత్రం ఆ రెండు పార్టీలు అధినేతలు చాలా స్నేహంగా వ్యవహరిస్తుంటారు. భాజపా కూడా వాటితో అదే పద్ధతిలో వ్యవహరిస్తుంటుంది. ఒకే ఒక్క తేడా ఏమిటంటే, తెలంగాణాలో తెరాస-భాజపాల మద్య ఎటువంటి మిత్రత్వం లేదు. ఏపిలో తెదేపా-భాజపాల మధ్య ఉంది. అంతే! అదేవిధంగా తెలంగాణా, ఏపిల మధ్య మరో పోలిక కూడా ఉంది. ఏపికి ప్రత్యేక హోదా సమస్య, తెలంగాణా హైకోర్టు విభజన సమస్య ఉన్నాయి కనుక ఆ రెండు పార్టీలు భాజపాకి పూర్తిగా దగ్గర కాలేకపోతున్నాయి లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో?
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరాసకి స్నేహహస్తం జాపినప్పటికీ, దానికి ఇంకా చాలా సమయం ఉందనో ఏమో కెసిఆర్ ఆ ప్రతిపాదనని తిరస్కరించారు. కానీ వచ్చే ఎన్నికల తరువాత కూడా కేంద్రంలో మళ్ళీ భాజపాయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కెసిఆర్ కి నమ్మకం కలిగితే, ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడవచ్చు. బహుశః అందుకేనేమో తెలంగాణా రాష్ట్ర భాజపా నేతలు తెరాసతో కొంచెం మృదువుగా వ్యవహరిస్తుంటారు. బహుశః అందుకేనేమో బిజెపి తెరాసకి తోక పార్టీలాగ తయారయిందని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారేమో?
ఏపిలో జగన్మోహన్ రెడ్డి భాజపాతో పొత్తుల కోసం ఆశగా ఎదురుచూస్తుంటే, తెలంగాణాలో టిఆర్ఎస్ తో పొత్తుల కోసం భాజపా ఆశగా ఎదురుచూస్తుండటం మరోవిశేషం. కానీ ఏపిలో ప్రస్తుతం తెదేపాతో స్నేహం ఉంది కనుక భాజపా ఇంకా బయటపడటం లేదు. కానీ ఒకవేళ తెదేపాతో కటీఫ్ చెప్పేసుకొంటే మాత్రం వెంటనే వైకాపా చెయ్యి అందుకోవచ్చు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి భాజపాకి అవకాశం లేదని ఈపాటికే గ్రహించి ఉంటుంది. కనుక కనీసం తన బలమైన పెంచుకోవాలని భాజపా ఆలోచిస్తే ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. కనుక ఏపిలో వైసిపితో, తెలంగాణా తెరాసల మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు భావించవచ్చు. కనుకనే తెలంగాణా నుంచి కెసిఆర్, కెటిఆర్ లేదా మరెవరు వచ్చినా, ఏపి నుంచి చంద్రబాబు నాయుడుపై పిర్యాదులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు వారిని కూడా తమ మిత్రులే అన్నట్లుగా ట్రీట్ చేస్తుంటారు.
యూపియే హయంలో ఇటువంటి స్నేహాలు ఎన్నడూ కనబడవు. దానిని బట్టి చూస్తే బిజెపి అధిష్టానం రెండు తెలుగు రాష్ట్రాలలో పాగా వేసేందుకు చాలా ముందు చూపుతో ఎంత తెలివిగా పావులు కదుపుతోందో అర్ధం అవుతుంది. ఇప్పుడు తెదేపా, తెరాస, వైకాపా, భాజపాలని కలిపి చూసినట్లయితే ఆ నాలుగు పార్టీలు కూడా తమ భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ఇప్పటి నుంచే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా అర్ధమవుతోంది. కనుక ఆ నాలుగు పార్టీల మద్య మిత్రత్వం, శత్రుత్వం అన్నీ అబద్దమే. అటువంటిది ఏమైనా ప్రదర్శిస్తుంటే అది కేవలం ప్రజలని మభ్యపెట్టడానికే. రెండు రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవడానికి ఏ పార్టీ దేనితోనయినా చేతులు కలుపవచ్చు. ఇవన్నీ ఆడుతున్న ఈ గేమ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రెండు రాష్ట్రాలలో అవుట్ అయిపోయేలా ఉంది. కానీ అది కూడా ఏపిలో వైకాపావైపు ఆశగా చూస్తోంది. తెలంగాణాలో మాత్రం ఒంటరి పోరాటం చేయకతప్పదు.