రజనీకాంత్.. ఈ సూపర్ స్టార్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీ ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరథం పడతారు. రజనీ అభిమానులు భక్తులుగా కొలుస్తారు. అందుకే కబాలి సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కోట్లు దండుకోగలుగుతోంది. అయితే ఓ చోట మాత్రం రజనీ హీరో కాదు. విలన్…! అదీ తన సొంత రాష్ట్రం కర్ణాటకలో. రజనీది బెంగళూరు. సినిమా అవకాశాల్ని వెదుక్కొంటూ చెన్నై వచ్చి… ఇక్కడ స్థిరపడ్డాడు. ఒకప్పుడు కర్నాటక వాళ్లు కూడా రజనీని పిచ్చిగా ఆరాధించారు. కానీ ఇప్పుడు రజనీ పేరు చెబితే..వాళ్లు మండిపడుతున్నారు. కబాలి సినిమాని కూడా అడ్డుకోవాలని చూశారు. ఇప్పుడు థియేటర్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. అన్నిచోట్లా సూపర్ స్టార్ గా వెలిగిన రజనీ.. సొంత మనుషులు తనపై పగ ఎందుకు పెంచుకొన్నారు?
కావేరీ నదీజలాల వివాదమే.. సొంత రాష్ట్రంలో రజనీని విలన్ని చేశాయి. కావేరీ నదీ జలాలపై హక్కుల కోసం కర్ణాటకకు, తమిళనాడు ఎప్పటి నుంచో పోట్లాడుకొంటున్నాయి. ఈ వివాదంలో రజనీ తమిళనాడుకే సపోర్ట్ ఇచ్చారు. కావేరీ నదీ జలాలపై కర్నాటక కంటే తమిళనాడుకే హక్కు ఉందని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచీ… బెంగళూరులో రజనీకి యాంటీ ఫ్యాన్స్ మొదలయ్యారు. రజనీ సినిమాల్ని అక్కడ అడ్డుకోవాలని చూస్తున్నారు. కబాలి ముందు కూడా అదే జరిగింది. ఆ రాష్ట్రంలో అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. వసూళ్లూ బాగానే వస్తున్నాయి. అయితే… రజనీ మనవాడు కాదు.. మనల్ని అన్యాయం చేశాడంటూ.. అక్కడ కొంతమంది రజనీకి వ్యతిరేకంగా ధర్నాలు మొదలెట్టారు. ”రజనీ వ్యాఖ్యల్ని పొలిటికల్ దృష్టి కోణంలో చూడొద్దు.. రజనీ ఓ స్టార్ అంతే..” అంటూ రజనీ ఫ్యాన్స్ కర్నాటక ప్రేక్షకుల్ని కోరుకొంటున్నారు. మరి సొంతూరిలో రజనీ ఎప్పుడు మద్దతు కూడగట్టుకొంటాడో చూడాలి.