మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. నష్టపరిహారంపై ప్రభుత్వం చెప్పేది సబబుగా లేదంటూ వందల మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము చెప్పిన ప్యాకేజీ అద్భుతమంటోంది. చివరకు ఈ వ్యవహారం గాలిలోకి కాల్పులకు దారి తీసింది.
ఆదివారం నాటి పరిణామాలు తెరాస ప్రభుత్వంపై పెను విమర్శలకు కారణమయ్యాయి. రైతులపై లాఠీచార్జి, భాష్పవాయు ప్రయోగం, గాలిలోకి కాల్పుల ద్వారా ప్రభుత్వం రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం చిక్కింది. ప్రజల్లోనూ ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకత వ్యక్తమైంది.
మెదక్ జిల్లా బంద్ కు ప్రతిపక్షాలు ఇచ్చిన పిలుపును విఫలం చేయడానికి అధికార పార్టీ బెదిరింపులకు దిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అధికార బలంతో అందరినీ భయపెట్టారనే ఆరో్పణల్లో ఎంత నిజమో తెలియదు. మొత్తానికి విపక్షాల బంద్ విఫలమైందని మాత్రం అధికార పార్టీ నేతలు ఘనంగా ప్రకటించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయరే అవసరం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు వాదించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారం ప్యాకేజీ సరిగా లేదని టీడీపీ నేతలు, జేఏసీ చైర్మన్ చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇది చాలా గొప్ప ప్యాకేజీ అంటోంది. మరి ఈ చిక్కుముడి వీడేదెలా?
ప్రభుత్వం పంతానికి పోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఒక పద్ధతి. ఇరిగేషన్ రంగ నిపుణులను, ఆ శాఖ ఉన్నతాధికారులను ఆ సమావేశానికి పిలవ వచ్చు. ప్రతిపక్ష నేతలు తమ అభ్యంతరాలు చెప్తారు. అవి ఎంతవరకు సమంజసమో నిపుణులు వివరిస్తారు. ప్రాజెక్టు ప్లాన్, ఇతర వివరాలను ఇరిగేషన్ అధికారులు చెప్తారు. ఏ అభ్యంతరమైనా ముఖాముఖి తేలిపోతుంది. సమస్య పరిష్కారానికి ఇది ఒక మంచి తరుణోపాయం. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎవ్వరి మాటా వినను అనే తరహాలో మొండికేస్తే మాత్రం ఈ వివాదం రావణ కాష్టంలా రగులుతూనే ఉండొచ్చు.
ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తే కచ్చితంగా ప్రతిపక్షాలను, జేఏసీని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకోవద్దని ఇప్పటికే హైకోర్టు కూడా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. రైతులు కోరిన ప్రకారమే పరిహారం ఇస్తామని, బలవంతంగా భూములు సేకరించేది లేదని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది.
ఈ పరిణామాలన్నీ గమనిస్తే, అఖిల పక్ష సమావేశమే సరైన మార్గమంటున్నారు పరిశీలకులు. మరి కేసీఆర్ ఏంచేస్తారో చూద్దాం.