ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం విజయవాడలో జరుగబోతోంది. కృష్ణా పుష్కరాల పనుల కోసం ఎటువంటి టెండర్లు పిలువకుండా రూ.86 కోట్లు విలువచేసే పనులని సోమా కంపెనీకి నోటిమాటగా కట్టబెట్టేందుకే మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారని సాక్షి మీడియా ఈరోజు సంచికలో ఒక వార్త ప్రచురించింది. సాగునీటి శాఖ ఆ పనులకి ఆమోదం తెలుపకపోయినా, ఆర్ధిక శాఖ అందుకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోకుండా సోమా కంపెనీకే దుర్గా ఘాట్ పనులు కట్టబెట్టడానికి సిద్దం అవుతున్నారని సాక్షి పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్ల కోసం ప్రతీసారి ఇలాగే చేస్తుంటారని సాక్షి ఆరోపించింది. అన్ని కోట్లు విలువైన పనులకి టెండర్లు పిలవకుండా సోమా కంపెనీకి పనులు అప్పగించడానికి సంబందిత ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేస్తే భవిష్యత్ లో ఇబ్బంది రావచ్చనే ఉద్దేశ్యంతోనే మంత్రివర్గం చేత ఆ ప్రతిపాదనకి ఆమోద ముద్ర వేయించాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు సాక్షి పేర్కొంది. అందుకే ఆగస్ట్ 1న జరుగవలసిన మంత్రివర్గ సమావేశం నేడే నిర్వహిస్తున్నట్లు సాక్షి పేర్కొంది. ఈ ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో పుష్కరపనులని సోమా కంపెనీకి అప్పగించే విషయంపై మాత్రమే చర్చ జరుగుతుందని సాక్షి పేర్కొంది.
ఒకవేళ నిజమైతే, ప్రభుత్వం తప్పకుండా అందుకు బలమైన కారణం చెప్పడం కూడా ఖాయమేనని భావించవచ్చు. కృష్ణా పుష్కరాలు హటాత్తుగా వస్తున్నవి కావు. అనేక ఏళ్ల ముందే అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో అందరికీ తెలుసు. అందుకే ప్రభుత్వం కూడా దాదాపు ఆరేడు నెలల క్రితం నుంచే పుష్కర పనులు ప్రారంభించింది. మరి అటువంటప్పుడు, టెండర్లు పిలువకుండా ఆఖరి నిమిషంలో అన్ని కోట్లు విలువైన పనులని ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించినట్లయితే సాక్షి ఆరోపణలని దృవీకరించినట్లే అవుతుంది. అందుకు ప్రభుత్వం ఇచ్చే సంజాయిషీని ప్రజలు కూడా విశ్వసించకపోవచ్చు. కనుక సాక్షి మీడియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ఆరోపణలు నిజమో కాదో మరికొన్ని గంటలలో మంత్రివర్గ సమావేశం ముగియగానే తేలిపోతుంది. ఒకవేళ అవి తప్పని తేలితే జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాని అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగానే బురద జల్లుతున్నారని భావించక తప్పదు.