కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఇవ్వాళ్ళ రాజ్యసభలో భాజపా సభ్యులకి వ్యతిరేకంగా సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా కోరుతూ తను ప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈనెల 22న రాజ్యసభలో ఓటింగ్ జరుగవలసిన సమయంలో, భాజపా సభ్యులు సభలో రభస చేసి ఓటింగ్ జరుగకుండా చేసి, తన హక్కులకి భంగం కలిగించారని కనుక వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ కెవిపి ఈరోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ కి నోటీసు అందజేశారు.
ఆరోజు భాజపా ఎంపిలు తన బిల్లుకి అడ్డుపడ్డారని ఆరోపిస్తున్న కెవిపి, ఆ సమయంలో తమ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా వారితో పోటీపడి సభలో నినాదాలు చేసిన సంగతిని విస్మరించారు. రెండు పార్టీలు కలిసే ప్రత్యేక హోదా రాకుండా నాటకాలు ఆడుతున్నాయని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారనే సంగతిని అవి గ్రహించకుండా ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్న ఆ అంశంపై అనవసరమైన రాజకీయాలు చేస్తున్నాయి. కెవిపి ప్రవేశపెట్టిన బిల్లుని తెలివిగా అడ్డుకొన్నామని భాజపా అధిష్టానం చాలా సంతోషపడుతుండవచ్చు కానీ రాష్ట్ర భాజపా నేతలు ప్రజల ముందుకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఆ బిల్లు ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే సంగతి ప్రజలకి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ తమని మభ్యపెట్టి మంచి చేసుకొని మళ్ళీ రాష్ట్రంపై పట్టు సాధించాలనుకోవడానికి ఈవిధంగా ప్రయత్నిస్తునందుకు దానిపై కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
ప్రత్యేక హోదా కోసం పెట్టిన బిల్లునే తెలివిగా పక్కదారి పట్టించేసిన భాజపా, ఈ సభాహక్కుల నోటీసుని చెత్తబుట్టలో పడేస్తుందని కాంగ్రెస్ పార్టీకి తెలియదనుకోలేము. అయినప్పటికీ హక్కుల నోటీస్ ఇచ్చారంటే ఆ డ్రామాని ఇంకా రక్తి కట్టించడం కోసమేనని చెప్పక తప్పదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్లి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమని భాజపా మోసం చేసిందని, తమ హక్కులని కాలరాసిందని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చు. ఈ విషయంలో తెదేపా, వైకాపాలు తెలివిగా తప్పించుకోగలిగాయి కానీ జాతీయపార్టీలైన కాంగ్రెస్, భాజపాలు మాత్రం కొరివితో తల గోక్కొంటున్నాయని చెప్పకతప్పదు.