ఇవ్వాళ్ళ తెలంగాణా కాంగ్రెస్ ‘ఛలో మల్లన్నసాగర్’ కి పిలుపునివ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ అక్కడికి బయలుదేరుతున్నారు. అక్కడికి వెళ్లి నిర్వాసితులకి సంఘీభావం తెలపడం వారి ఉద్దేశ్యమట! కానీ వారిని అక్కడికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకొంటున్నారు. కాంగ్రెస్ నేతలని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. వారు అక్కడికి వెళితే నిర్వాసితులని ఇంకా రెచ్చగొడతారని తెరాస ప్రభుత్వం వాదిస్తోంది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం అధికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న ఈ పోరాటం చూస్తుంటే, అది ప్రజల కోసమా లేక తమ రాజకీయ ప్రయోజనాలని కాపాడుకోవడం కోసమా? అనే అనుమానం కలుగుతోంది.
తెరాస ఆకర్ష పధకంతో కాంగ్రెస్ పార్టీ చాలా మంది ముఖ్యనేతలని కోల్పోయింది. ఇప్పటికీ మేలుకోకపోతే ఇంకా మిగిలినవారిని కూడా తెరాస ఖాళీ చేసేసే ప్రమాదం ఉంది. ఆ విషయం ఆలస్యంగానైనా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. గుర్తించగానే తెలంగాణా కాంగ్రెస్ నేతలని అప్రమత్తం చేసి వారికి మార్గదర్శనం చేసింది. ఈమధ్య జైపాల్ రెడ్డి తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం గమనిస్తే ఆయనకే ఈ మేల్కొలుపు బాధ్యతని అప్పగించినట్లు అనుమానం కలుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలుపెడితే అది ఎలా ఉంటుందో తెరాస ప్రభుత్వానికి రుచి చూపేందుకే ఈ హడావుడి అంతా తప్ప నిర్వాసితుల కోసమో మరొక సాంకేతిక కారణాల చేతనో కాదనిపిస్తోంది. కాంగ్రెస్ జోరు గమనిస్తే అది తన ప్రయత్నంలో సఫలం అయినట్లే కనిపిస్తోంది. ఒకవేళ ఈ పోరాటాలకి జైపాల్ రెడ్డి నేతృత్వం వహిస్తుండటం నిజమైతే త్వరలో ఆయనే పిసిసి అధ్యక్షుడుగా నియమింపబడవచ్చు.
ఇక 8 ముంపు గ్రామాలలో 5 గ్రామాలలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయాయని, ఏటిగడ్డ కిష్టాపూర్ లో సుమారు 1,000 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయాయని మంత్రి హరీష్ రావు చెప్పిన మాటలు నిజమయితే, నిర్వాసితులని కలవడానికి వెళుతున్న కాంగ్రెస్ నేతలని అరెస్టులు చేయవలసిన అవసరమే లేదు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన తరువాత ఇంక కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి చేసేదేముంటుంది? కానీ అడ్డుకొంటోందంటే ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాకపోయుండవచ్చు కనుక వారిని అడ్డుకొంటోందేమో అని అనుమానం కలుగుతోంది.
ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడికి లొంగకుండా ముందుకు సాగి తన సత్తా చూపుకోవాలని తెరాస ప్రయత్నిస్తునట్లుంది. మల్లన్నసాగర్ పై ఇంత తీవ్ర పోరాటం చేయడమే ద్వారా తెలంగాణాలో తను బలహీనపడలేదని కాంగ్రెస్ పార్టీ చాటుకొనే ప్రయత్నం చేస్తున్నట్లుంది. మధ్యలో నిర్వాసితులు, వారి ప్రయోజనాలు కాపాడటం, అవినీతి ఇవన్నీ రాజకీయ పార్టీలకి పడికట్టు పదాలుగా వాడుకోవడానికి మాత్రమే పనికివస్తున్నాయి. అంతే!