సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?? అతను డైలాగ్ కింగ్. డబ్బింగ్ ఆర్టిస్టుగా మొదలైన అతని ప్రయాణం హీరోగా మారి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా జామ్ జామ్ అంటూ సాగిపోతోంది. సహాయనటుడిగా సాయికుమార్ బిజీగా ఉన్నాడు. తొలిసారి తనయుడు ఆదితో కలసి చుట్టాలబ్బాయ్లో నటిస్తున్నాడు. అన్నట్టు జనతా గ్యారేజ్‌లోనూ సాయికుమార్‌కి మంచి పాత్ర దక్కింది. ”అన్నగారు నందమూరి తారక రామారావుగారితో పనిచేశా. మనవడు ఎన్టీఆర్ తోనూ కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ ఎన్టీఆర్ నుంచి ఈ ఎన్టీఆర్ వరకూ కలసి పనిచేయడం ఆనందంగా ఉంది. మోహన్‌లాల్ నటించిన సినిమాలకు తెలుగులో నేను డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు అదే మోహన్‌లాల్ తో నటించా. అదీ స్పెషల్ మెమొరీనే” అంటున్నాడు సాయికుమార్.
తనయుడు గురించి చెబుతూ ”ఆది నటుడిగా నిరూపించుకొన్నాడు. ఎవరి దగ్గరకు వెళ్లినా ‘ఆది బాగా చేస్తున్నాడండీ.. ఒక్క హిట్టు పడితే చాలండీ’ అంటున్నారు. నాకూ అదే అనిపించింది. వాడి కష్టం వాడు పడుతున్నాడు.. అటుపై దేవుడి దయ” అని చెప్పుకొచ్చాడు. కన్నడలో సాయి కుమార్ చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలున్నాయట. తెలుగులో ఆరు చిత్రాలున్నాయి. సాయి కంటే బిజీ ఆర్టిస్టు ఎవరుంటారు చెప్పండి?? అన్నట్టు బుధవారం సాయికుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చుట్టాలబ్బాయ్ స్పెషల్ టీజర్‌ని కూడా రిలీజ్ చేస్తున్నారు.