తెలంగాణా మంత్రి హరీష్ రావు ఏపి రాజధాని అమరావతి గురించి మాట్లాడటం చాలా ఆసక్తికరమైన విషయమే. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం తెరాస ప్రభుత్వం భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణా తెదేపా నేతలకి ధీటుగా జవాబుగా చెపుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న భూసేకరణ లెక్కలు చెప్పి వాటి గురించి తెలంగాణా తెదేపా నేతలు సమాధానం చెప్పాలని అన్నారు.
అమరావతి గురించి ఆయన ఏమ్మన్నారంటే, “అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి బలవంతంగా 54,000 ఎకరాల భూసేకరణ చేసింది. అమరావతి కోసం 500 ఎకరాలు సరిపోవా? అని నేను అడుగుతున్నాను. ఈ భూప్రపంచంలో ఏ దేశ రాజధాని నగరం అయినా 54,000 ఎకరాలలో కట్టారా? అక్కడ ప్రభుత్వం అమరావతి రింగ్ రోడ్డు కోసం 4,200 ఎకరాలు, కాకినాడ ఎస్.ఈ.జెడ్.కోసం-6,000 ఎకరాలు, మచిలీపట్టణం పోర్టు కోసం-15,000 ఎకరాలు, వాన్పిక్ కోసం-16,000 ఎకరాలు, గన్నవరం విమానాశ్రయం కోసం-2,500 ఎకరాలు, ప్రకాశం దోనకొండ ఎస్.ఈ.జెడ్.కోసం-28,000 ఎకరాలు, నెల్లూరు ఎస్.ఈ.జెడ్.కోసం-12,000 ఎకరాలు సేకరిస్తోంది. అక్కడ ప్రభుత్వం లక్షల ఎకరాలు సేకరిస్తుంటే మాట్లాడని తెదేపా నేతలు, ఇక్కడ కొద్దిపాటి భూమిని సేకరిస్తుంటే, అన్యాయం అక్రమం అంటూ నానా రభస చేస్తున్నారు.”
“మరో విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తున్న భూములన్నీ కూడా ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములే. వాటిని ఇవ్వమని అక్కడ రైతులు ఎంత ఏడుస్తున్నా వినకుండా ప్రభుత్వం వారి దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకొని వాటిని పారిశ్రామికవేత్తలకి కట్టబెడుతోంది. కానీ మేము కొద్దిపాటి భూమిని తీసుకొని బీడుబారిన భూములకి నీళ్ళు అందించి పంటలు పండించుకోవాలనుకొంటున్నాము. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న తేడా అదే,” అన్నారు హరీష్ రావు.
“ఇక భూసేకరణ విషయంలో కూడా తెదేపా నేతలు డిల్లీలో ఒకలాగ, గల్లీలో మరొకలాగ మాట్లాడుతుంటారు. ఇక్కడ భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూమిని సేకరించాలని వాదిస్తుంటారు. అక్కడ డిల్లీలో తెదేపా కేంద్రమంత్రులు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని సంతకాలు చేస్తుంటారు. తెదేపా ఎంపిలు పార్లమెంటులో భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. అందరూ ఒకే పార్టీ కదా? పార్టీ అన్నాక ఒక పాలసీ అంటూ ఉండాలి కదా? ఇక్కడ తెలంగాణాలో ఒకలాగ, అక్కడ డిల్లీలో ఒకలాగా, ఏపిలో మరొకలాగ రెండు నాలుకలతో ఎందుకు మాట్లాడుతున్నారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆయన విమర్శలకి, ప్రశ్నలకి తెదేపా నేతలే సమాధానం చెపితే బాగుంటుంది.