రజనీకాంత్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయనకు ఏమైంది? ప్రపంచ వ్యాప్తంగా రజనీ అభిమానులు టెన్షన్ పడుతున్న విషయం ఇదే. అమెరికా నుంచి తిరిగొచ్చిన రజనీ ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించాడు. అభిమానులకు రజనీ ఓ లేఖ కూడా రాశాడు. వరుస షూటింగ్‌ల వల్లే అలసటకు లోనయ్యానని, అందుకే అమెరికాలో విశ్రాంతి తీసుకొన్నాని, ఇప్పుడు ఆరోగ్యం బాగుందని వివరణ ఇచ్చుకొన్నాడు రజనీ. అంతేకాదు… కబాలి రిజల్ట్‌పై కూడా రజనీ సంతోషం వ్యక్తం చేయడం విశేషం. ఈ సినిమా తీసిన నిర్మాతకు, దర్శకుడికీ కృతజ్ఞతలు తెలియజేశాడు రజనీ. థియేటర్ యజమానులకు, పంపిణీదారులకు. మరీ ముఖ్యంగా తన కోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు రజనీ థ్యాంక్స్ చెప్పుకొన్నాడు. ”నన్ను బతికిస్తున్న తమిళ ప్రజలకు నా నమస్కారాలు” అంటూ తమిళంలో మొదలైన రజనీ లేఖ ‘మంచిది’ అంటూ కబాలి డైలాగ్‌లో ముగించడం విశేషం. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షికారు చేస్తోంది. రజనీ ఆరోగ్యం గురించి ఇప్పటి వరకూ కొనసాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు రజనీనే తెరదించాడు. సో.. ఈ టెన్షన్ తీరిపోయినట్టే ఇక.