కబాలి . చిత్రంలో రజనీ స్టైల్ మాత్రమే బావుందని కొందరు, అది అసలు లేదని మరికొందరు రకరకాలుగా సమీక్షలు వచ్చాయి. చిత్ర నిర్మాణంలో సంబంధం ఉన్న వేమూరి సత్యనారాయణ వంటివారు కూడా క…బాలే అని తీసేశారు. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్‌ను వాడుకోవడంలో దర్శకుడు పా.రంజిత్ సఫలం కాలేదని కూడా కొంతమంది భావించారు.
వాస్తవానికి కబాలి చిత్రాన్ని పరిశీలించేప్పుడు మనం భారతీయ సినిమాను గాక హాలివుడ్ నమూనాను తీసుకోవాల్సి వుంటుంది. ప్రతి సినిమాలో నవరసాలు, ఉద్వేగ ఘట్టాలు ఉండాలని . అందులోనూ సూపర్ హీరోలంటే ప్రతి సన్నివేశంలో అలరించాలని, అనుకుంటారు. కోట్లు కుమ్మరించే ప్రస్తుత సినిమాల నిర్మాణం ఒక జాతీయ వ్యాపారం అయిపోయింది. దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది రజనీకాంత్ నటించిన ముత్తు వంటి చిత్రాలే. హిందీ సినిమాలకు ఎంతోకొంత ప్రపంచ మార్కెట్ ఉండింది. గానీ దక్షిణాది ప్రాంతీయ భాషా చిత్రాలకు ఆ హోదా ఆయన తీసుకువచ్చారు. ఈ క్రమంలో రజనీ ఒక ఇంటర్నేషల్ బ్రాండ్‌గా మారిపోయారు. వ్యాపార నమూనాగా మలచబడ్డాడు. ఆయన గత చిత్రాలు – చంద్రముఖి, శివాజి, రోబో, విక్రమసింహ అన్నిటిలో తన మ్యానరిజమ్స్ వెనక్కు పోయి భారీ తనం, సాంకేతిక ప్రాధాన్యత డామినేట్ చేయడం చూడొచ్చు. తమిళ పెదరాయుడిగా గ్రామీణ భూస్వామ్యాన్ని ప్రతిబింబించిన రజనీ చివరకు మర మనిషి (ఎత్తిరన్-రోబో)గా మారిపోవడం సినీమాయ ప్రభావమే. లింగా మాత్రం కొంత తేడాగా వచ్చినా పరాజయం చవిచూసింది. ఈనేపథ్యంలో కబాలి అక్షరాల హాలీవుడ్ నమూనాలో రూపొందింది. మలేషియా, థారులాండ్, ఇండియా దేశాలతో ముడిపడిన ఈ తమిళ కథ నాయకుడు, భాషాలాంటి వాటికంటే పెద్ద భిన్నం కాదు. ఆ ఫార్మూలను ప్రపంచీకరించి హాలీవుడ్ టేకింగ్‌తో ట్రాక్ తప్పకుండా నడిపించింది దర్శకుడు రంజిత్ ఆలోచనే. ఆయన చిత్రాల్లో కొద్దిపాటి సామాజిక, రాజకీయ దృష్టి, జాతుల, ఉపజాతుల, సాంస్కృతిక సృహ కనిపిస్తాయి. గతంలో తీసిన మద్రాసు చిత్రం మనకు తెలిసిన మామూలు మద్రాసు (చెన్నై) వాతావరణానికి భిన్నమైన వాస్తవికత చూపిస్తుంది. మలేషియాలోని తమిళుల మనుగడను మాఫియాల పట్టును ప్రధానంగా చూపించిన కబాలి కూడా అలాంటిదే. కాకపోతే ఈ చిత్రం రజనీది కావడం వల్లనే దర్శకుడు రంజిత్ భారీ బడ్జెట్‌తో సింగిల్ ట్రాక్‌లో వెళ్లే సాహసం చేశాడు. మనవాళ్లు కథా నెమ్మదిగా నడుస్తుందని అనడంలో అర్థం మలుపులు, సెంటిమెంట్లు ఎక్కువగా కోరుకోవడం అని చెప్పొచ్చు. ఒకే అంశాన్ని భారీగా, గాఢంగా చూపడంహాలీవుడ పద్దతి. ఎంటర్ ది డ్రాగెన్ నుంచి కబాలి వరకు ఆ తరహా మారదు. ఇక్కడ రంజిత్ సామాజిక యోచనను హాలీవుడ్ తరహాలో తీయడానికి రజనీ సూపర్ స్టార్ హోదా ప్రధానంగా దోహదపడింది. వసూళ్లు బాగా వచ్చాయి. పాటలు సాంప్రదాయకంగా లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చిత్రాన్ని ఒక అనుభూతిగా మలచింది. ఎటొచ్చి నా ఉద్దేశ్యంలో పదేపదే ఫ్లాష్‌బ్యాక్‌లు, ఫ్రీ లైఫ్ సొసైటీ సన్నివేశాలు అంతకంటే ముఖ్యంగా సీతారామరాజు ఎపిసోడ్లు అతకలేదు. అవికూడా సరిగ్గా ఉంటే ఈ చిత్రం మరింత ఆకట్టుకునేది. వయోధిక పాత్రలో రజనీకాంత్ ఒదిగి పోయిన తీరు తన స్టైల్‌ను దానికనుగుణంగా మలుచుకోవడం ప్రొఫెషనలిజానికి అద్దంపట్టింది. సో… హాలివుడ్ కమర్షియల్ ఫ్రేమ్‌లో కబాలి ఓకే. ఆ చిత్రాలను కాఫీకొట్టి తీయడం కాక పునసృష్టి చేయడం ఈ చిత్రంతో మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే అతడు వంటి చిత్రాలు అనుకరణలే గాని సంపూర్ణంగా ఆ నమూనాలో రూపొందలేదు. ఆ ఘట్టం కబాలితో ఆరంభమవుతుంది. దీనివల్ల నిర్మాణ వ్యయం ప్రచార ఖర్చు, విడుదల ఖర్చు అన్నీ పెరిగి సినిమా సగటు ప్రేక్షకులకే గాక నిర్మాతలకు హీరోలకు కూడా అందుబాటులో లేకుండా పోతుంది.