మల్లన్న సాగర్ రైతులు యువకులపై లాఠీచార్జి గాలిలోకి కాల్పులు ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ చర్చను వేదెక్కించాయి. ఈ విషయమై వారు కొన్నిమాసాలుగా ఆందోళనలు నిరశనదీక్షలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతిపక్షాల కుట్ర అంటూ ఆరోపణలు మొదలు పెట్టింది. వేములఘాట్ తదితర గ్రామాల్లో జరిగిన లాఠీచార్జి దృశ్యాలు తీవ్ర విమర్శలకు కారణమైనాయి.బంగారు తెలంగాణ ఇంత త్వరగా నిర్బంధ పర్వాన్ని పునరావృతం చేసిందనేది ప్రజలు రాజకీయ కార్యకర్తలు జీర్థం చేసుకోలేకపోతున్నారు. మల్లన్నసాగర్ అంత పరిమాణంలో కట్టాలా అనేదానిపై తీవ్రమైన భిన్నాభిప్రాయాలున్నాయి.కెసిఆర్ హరీష్‌రావుల నియోజకవర్గాలలో ముంపుతగ్గించి పక్కనే వున్న దుబ్బాక నియోజకవర్గంలో అవసరానికి మించి గ్రామాలను ముంచేస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వున్నాయి. 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కకు నెట్టి 123 పేరిట తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి పునరావాస బాధ్యత నుంచి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవాలని చూడటం రెండవ సమస్య. రామాయణంలో పిడకలవేటలా ఈ సమస్యలో తెలంగాణ ప్రథమ కుటుంబంలోని వైరుధ్యాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయనే విమర్శ వుంది.నీటిపారుదల శాఖ మంత్రిగా మొత్తం సమస్య హరీష్‌రావుపై నెట్టి ముఖ్యమంత్రి గాని ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు గాని దూరం వుండిపోతున్నారనేది కనిపిస్తున్న వాస్తవం.ఈ వ్కవహారంలో హరీష్‌ను బద్నాం చేసి శాఖ నుంచి తప్పించాలనే ఆలోచనలు కూడా వున్నాయని కొందరు మాజీ ప్రస్తుత టిఆర్ఎస్ నేతలంటున్న మాట.ఈ వారం విదేశాలకు వెళ్లవలసిన హరీష్ నిజంగా వెళ్లివుంటే తీవ్ర అభిశంసన తప్పకపోయేదని కూడా వారు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా హరీష్ రావు దోరణి చూస్తే ప్రతిపక్షాలపై దాడి చేయడం తప్ప ప్రజాస్వామిక పరిష్కారంతో బయిటపడటం కోసం చూడటం లేదు. 2013 లేదా 123 ఏదైనా కోరుకోవచ్చు నని ఒకసారి అన్నారు గాని మళ్లీ తనే వెళ్లి కులపెద్దల ద్వారా గ్రామాలలో కొందరిని తిప్పుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా రెంటిలో ఏదైనా ఒప్పుదలేనని ప్రకటించింది. అయితే ఈ ప్రకటనలకు కొనసాగింపు లేదు. 2013 వల్ల నష్టం కలుగుతుందని అవాస్తవ హెచ్చరికలు చేస్తూనే వున్నారు.
ఈ క్రమంలో మరీ హాస్యాస్పదమైంది సిపిఎం, టిడిపి కాంగ్రెస్‌లు రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పడం. బిజెపిని ఎందుకు వదిలివేశారో తెలియదు. లాఠీచార్జి వార్తను మొదటి పేజీలో ఇవ్వని నమస్తే తెలంగాణ సిపిఎం కుట్రల గురించి మరుసటి రోజున పతాక శీర్షికలో కథనం ప్రచురించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గతంలో (2008) ముదిగొండలో చేసిన కుట్ర వంటిదే ఇక్కడా చేస్తున్నారని ఆ కథనం సారాంశం. తమాషా ఏమంటే ముదిగొండలో మృతులను పరామర్శించేందుకు ముందుగా వెళ్లిన నాయకుడు కేసిఆరే! అలాటి పోరాటాన్ని ఇప్పుడు కుట్రగా పేర్కొనడం విచిత్రం. ఏది ఏమైనా ఎదురుదాడులతో ఆరోపణలతో నిర్వాసితుల ఉద్యమాన్ని దెబ్బతీయడం జరిగేపని కాదు. వివిధ ప్రాజెక్టులు పారిశ్రామికఅవసరాల కోసం మొత్తం 9 లక్షల ఎకరాల వరకూ తీసుకోవాలనుకుంట్ను టిసర్కారు మల్లన్ససాగర్ పోరాటం విషయంలో మొండిగా వుండాలనే భావిస్తున్నట్టు అర్థమవుతుంది ఈ కారణంతోనే ప్రతిపక్షాలు కూడా ఇక్కడ లొంగిపోతే మిగిలిన అన్ని చోట్ల విచ్చలవిడిగా భూములు తీసేసుకుంటారని అంచనా వేస్తున్నది. కనుకనే ఇది కీలక రాజకీయ పోరాటం అవుతున్నది. బీకర రూపం తీసుకుంటున్నది.