ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా 2014ఎన్నికల సమయంలో మోడీ, వెంకయ్య నాయుడు తదితర భాజపా నేతలు ఆ హామీలనే కాక ఇంకా అనేక హామీలు ఇచ్చారు. అన్నిటినీ అమలుచేసి రాష్ట్రాన్ని ఆదుకొంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి విభజన వలన చాలా నష్టం జరిగిందని బాధ పడిన నరేంద్ర మోడీ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయం కోసం పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. హోదాకి 14వ ఆర్ధిక సంఘం అడ్డని, రైల్వేజోన్ కి కమిటీ పరిశీలిస్తోందని, మెట్రో రైల్ కి జనాభా సరిపోరని, పోలవరానికి లెక్కలు తేడా వస్తున్నాయని ఇలాగ ఒక్కో హామీకి ఒక్కో కుంటిసాకు చెపుతూ ఒక్కో హామీని పక్కన పెట్టేస్తున్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చకపోవడం వలననే ఇవ్వలేకపోతున్నామని ఇంతవరకు తప్పించుకొంటున్న మోడీ ప్రభుత్వం, మొన్న కాంగ్రెస్ పార్టీ దాని కోసం విభజన చట్ట సవరణ చేయడానికి ప్రైవేట్ బిల్లు ద్వారా ప్రయత్నిస్తే, భాజపా దానికి సహకరించకపోగా ఆ బిల్లుపై ఓటింగ్ జరుగకుండా అడ్డుపడి తప్పించుకొంది. తద్వారా ఏపి పట్ల తన వ్యతిరేక వైఖరిని తనే బయటపెట్టుకొన్నట్లయింది.
ఈవిధంగా వ్యవహరించడం వలన రాష్ట్ర ప్రజలలో భాజపా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది..దాని వలన పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భాజపా అధిష్టానానికి, మోడీ ప్రభుత్వానికి తెలియదనుకోలేము. అయినా అలాగే వ్యవహరిస్తోందంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకి మళ్ళీ ఏదో ఒకటి చెప్పి గెలవవచ్చనే ధీమా అయ్యుండవచ్చు లేదా వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో విజయం సాధించడానికి వేరే వ్యూహం ఏదో ఉండి ఉండవచ్చు లేదా హామీలు అమలుచేయడం కంటే కాంగ్రెస్ పార్టీలాగే రాష్ట్ర భాజపాని పణంగా పెట్టడానికి సిద్ధపడుతుండవచ్చు. కారణాలు ఏవైనా హామీల అమలు విషయంలో కేంద్రప్రభుత్వం ఏపికి హ్యాండ్ ఇవ్వడానికి సంకోచించడం లేదనే విషయం మాత్రం స్పష్టం అయ్యింది. కనుక తెదేపా కూడా భాజపాతో సంబంధాలు కొనసాగించడంపై పునరాలోచించుకోవలసిన సమయం దగ్గర పడినట్లే భావించవచ్చు.