ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ నిన్న కేంద్రప్రభుత్వానికి తన హామీలని మరొకమారు గుర్తు చేసి వాటిని అమలుచేయవలసిన బాధ్యత దానిదేనని స్పష్టం చేశారు. తీవ్ర ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ తను ఇచ్చిన హామీలని ఏవిధంగా అమలుచేస్తున్నానో, అదేవిధంగా కేంద్రప్రభుత్వం కూడా విభజన హామీలని అన్నిటినీ అమలుచేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేము కనుక అందుకు ఏమాత్రం తీసిపోనివిధంగా సహాయం చేస్తానని కేంద్రప్రభుత్వమే పలుమార్లు హామీ ఇచ్చింది కనుక కనీసం ఆ హామీనయినా నిలబెట్టుకోవాలని కోరారు. ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకొనేందుకు వీలుగా ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టంలో నిబంధనలు సవరించి రుణపరిమితిని పెంచమని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేతులు, కాళ్ళు కట్టేసి పరుగుపెట్టమంటే ఎలాగ? అని కేంద్రాన్ని నిలదీశారు.
తెదేపా భాజపాకి మిత్రపక్షంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉంది. కనుకనే ముఖ్యమంత్రి నేటికీ చాలా సంయమనం పాటిస్తూ ఈవిధంగా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆయన చెపుతున్న సమస్యలేవీ ఆయన స్వంత సమస్యలు కావు. రాష్ట్రానికి సంబంధించినవి. కనుక వాటి పరిష్కారం కోసం కేంద్రప్రభుత్వం ఆయనకి అన్నివిధాల సహాయసహకారాలు అందించవలసి ఉంటుంది. తెదేపా-భాజపాల మద్య నెలకొన్న విభేదాలు, రాజకీయ ఎత్తుగడలు, లెక్కలు చూసుకొంటూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే, దాని వలన రెండు పార్టీలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే క్లిష్టపరిస్థితులలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడినపెట్టి అభివృద్ధి చేయగలరనే నమ్మకంతోనే ప్రజలు తెదేపాని గెలిపించారు. అలాగే మోడీ రాష్ట్రానికి అన్నివిధాల సహాయం చేస్తారనే నమ్మకంతోనే భాజపాతో తెదేపా పొత్తులు పెట్టుకొంది. కానీ గడిచిన రెండేళ్లలో ఆశించినంత వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగడం లేదని కళ్ళకి కనబడుతూనే ఉంది. దాని వలన మొట్టమొదట చంద్రబాబు నాయుడుకి, తెదేపాకి చెడ్డపేరు వస్తుంది. ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతుంది.
అటువంటి పరిస్థితే వస్తే భాజపాతో తెగతెంపులు చేసుకోవడానికి తెదేపా వెనుకాడకపోవచ్చు. అప్పుడు రాష్ట్రంలో భాజపా రెండు విధాలుగా నష్టపోతుంది. హామీలు అమలుచేయని కారణంగా ప్రజలలో ఏర్పడే వ్యతిరేకత వలన కలిగే నష్టం, రాష్ట్రంలో బలమైన మిత్రుడిని శత్రువుగా మార్చుకొనందుకు భాజపాయే నష్టపోతుంది. కనుక ఇప్పటికైనా ముఖ్యమంత్రి సవినయంగా చేస్తున్న విజ్ఞప్తులని కేంద్రప్రభుత్వం అలుసుగా తీసుకోకుండా హెచ్చరికలుగా భావించడం మంచిది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే మిత్రుడు చేస్తున్న సూచనలని చెవికి ఎక్కించుకొని ముందే జాగ్రత్త పడితే మంచిది కదా?