పంచాయితీరాజ్ వ్యవస్థలో భాగమైన మండల, జిల్లా పరిషత్, ఎంపీటీసీ, జెడ్.పి.టీ.సీ.తదితర స్థానిక సంస్థలకు 2020 వరకు నిధులు కేటాయించలేమని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సంస్థలకి రూ.15,000 కోట్లు, తెలంగాణాలో సంస్థలకి రూ.9,000 కోట్లు కేంద్రం నుంచి రావలసిన నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ రెండు రాష్ట్రాల పంచాయితీరాజ్ చాంబర్ల ప్రతినిధులు వాటి అధ్యక్షుడు తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో డిల్లీ వెళ్లి జైట్లీకి నిన్న ఒక వినతి పత్రం ఇచ్చారు.
సాధారణంగా ఇటువంటి సందర్భాలలో “చూస్తాము..పరిశీలిస్తాము..తప్పకుండా సహాయం చేస్తామంటూ” హామీలు ఇచ్చి కేంద్రప్రభుత్వం తప్పించుకొంటుంది. కానీ జైట్లీ మాత్రం కుండబ్రద్దలు కొట్టినట్లు, వారు కోరిన విధంగా నిధులు ఇవ్వడం సాధ్యం కాదని, రాష్ట్రానికి అదనంగా ఇస్తున్న 10శాతం పన్నుల నుంచే వాటిని సర్దుబాటు చేసుకోమని సలహా ఇచ్చారు. అయినా పంచాయితీరాజ్ చాంబర్ల ప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో 14వ ఆర్ధిక సంఘం అందుకు ఒప్పుకోదని కనుక నిధులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అది పంచాయితీలకి మాత్రమే నిధులు ఇమ్మని సిఫార్సు చేసింది తప్ప పంచాయితీరాజ్ వ్యవస్థలో మండల, జిల్లా పరిషత్ లకి నిధులు ఇమ్మని ఎటువంటి సిఫార్సులు చేయలేదని జైట్లీ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతినిధులు పరిస్థితులు వివరించి నిధుల కోసం ఒత్తిడి చేసినప్పుడు, 2020లో 15వ ఆర్ధిక సంఘం ఏర్పాటు అవుతుందని అప్పుడు ఈ అంశాన్ని దానిలో చేర్చుతానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు నిధులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఆర్ధికమంత్రి ఇంత ఖరాఖండిగా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక పంచాయితీరాజ్ చాంబర్ల ప్రతినిధులు వెనుతిరిగారు.
కేంద్రప్రభుత్వం తన వద్ద ఉన్న నిధులలో నుంచి దేశంలో వివిధ రాష్ట్రాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి నిధులు కేటాయిస్తుంటుంది. గ్రామీణ వ్యవస్థలని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే 14వ ఆర్ధిక సంఘం పంచాయితీలకి ప్రతీ ఏటా నిధులు కేటాయించమని సిఫార్సు చేయడంతో వాటికి నిధులు కేటాయిస్తోంది. నిధుల కోసం దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిత్యం అనేక డిమాండ్లు వస్తూనే ఉంటాయి. అవికాక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకి ఇచ్చిన హామీల అమలుకోసం మళ్ళీ వేరేగా నిధులు కేటాయించవలసి ఉంటుంది. దేశ రక్షణ, మౌలిక వసతుల అభివృదికి కేంద్రానిదే పూర్తి బాధ్యత కనుక వాటి కోసం కూడా నిధులు సిద్దం చేసుకోవలసి ఉంటుంది. కనుక వీటన్నిటికీ తగినన్ని నిధులు సమకూర్చుకోవడం, వాటిని మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం కేటాయించి ఖర్చు చేయడం కోసమే 14వ ఆర్ధిక సంఘం, నీతి ఆయోగ్ వంటి వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసుకొంది. అవి నిర్దేశించిన విధంగానే కేంద్రం నడుచుకొంటున్నట్లు ఆర్ధికమంత్రి మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆవిధమైన ఆర్ధిక క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా మంచిదే. వ్యవస్థలు బలంగా ఉండటానికి అది చాలా అవసరం కూడా.
కానీ 14వ ఆర్ధిక సంఘం, నీతి ఆయోగ్ లని సంప్రదించకుండానే, కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు చేయకపోయినా జమ్మూ కాశ్మీర్, బిహార్ వంటి రాష్ట్రాలకి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా లక్షల కోట్లు నిధులు కేటాయించిన సంగతి అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు పంచాయితీరాజ్ సంస్థలకి నిధులు కేటాయించడానికి అభ్యంతరం దేనికి? వాటికి కేంద్రప్రభుత్వమే నిధులు కేటాయించవలసి ఉన్నట్లయితే, పంచాయితీలతో బాటు వాటికీ బడ్జెట్ లోనే నిధులు కేటాయించి ఉండాలి. ఒకవేళ అటువంటి హామీ ఇచ్చి ఉండకపోతే, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది.