ఇప్పటికే పలు దఫాలుగా భారతీయ జనతా పార్టీ వాళ్లు, కాషాయ పార్టీ సానుభూతి పరులు మంత్రి కామినేని శ్రీనివాసరావు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మధ్య విజయవాడలో సాధువులు, సంతులు కలిసి చంద్రబాబును శాపనార్థాలు పెట్టడానికి ఏర్పాటు చేసిన సభలో కామినేని ప్రసంగంపై అక్కడిక్కడే నిరసన వ్యక్తం అయ్యింది. అయనను అక్కడ నుంచి పంపించివేసేంత వరకూ వారు శాంతించలేదు. మరి కామినేని విషయంలో ఇలాంటి అసంతృప్తి అంతటికీ కారణం.. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలా వ్యవహరించడమే!
తెలుగుదేశం, బీజేపీలు మిత్రపక్షాలే అయినా.. రాజకీయ పార్టీకి మరో రాజకీయ పార్టీకి తగుదూరం ఉంటుంది. రెండూ కాషాయధరించే పార్టీలే అయినా.. మహారాష్ట్రలో శివసేన, బీజేపీల మధ్య బోలెడన్ని విబేధాలున్నాయి. అయితే కామినేని మాత్రం బీజేపీ నేతకు తక్కువ.. తెలుగుదేశం నేతకు ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ లో మరో బీజేపీ మంత్రి మాణిక్యాల రావు ఉన్నా.. ఆయన మరీ అంతగా పూసుకోడు. అయితే కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు దాటి వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కామినేని మాత్రం సగటు తెలుగుదేశం నేతగా మారిపోయాడిప్పుడు!
విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతల మీటింగ్ ఒకటి జరిగితే దానికి కామినేని హాజరయ్యాడు. అది బీజేపీ, తెలుగుదేశం సమన్వయానికి సంబంధించిన మీటింగ్ కాదు.. కృష్ణా జిల్లాలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, నియోజకవర్గ స్థాయిలో పార్టీ పునాదులను ఎలా పటిష్ట పరచాలి.. అనే అంశం గురించి సమాలోచనలు చేసుకోవడానికి టీడీపీ వాళ్లు ఏర్పాటు చేసుకున్నసభ అది. దానికి ఈ బీజేపీ నేత హాజరై.. తమ్ముళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు! మరి తెలుగుదేశం పార్టీ పై అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ.. మరీ ఇలా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి, తెలుగుదేశం జిల్లా కార్యాలయాలకు వెళితే జనాలైనా నవ్వుతారనే ఫీలింగ్ కామినేనికి లేకపోయింది పాపం! మరి దీనిపై కమలనాథులు ఎలా స్పందిస్తారో!