వచ్చే నెల 7న గజ్వేల్లో మిషన్ భగీరథ పధకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఆయన రాష్ట్రానికి వస్తున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమం కోసం చాలా బారీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ వస్తునందున ఆ కార్యక్రమం భాజపాకి కూడా చాలా ముఖ్యమైనదే. అటువంటి కార్యక్రమంలో భాజపాకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా ధర్నా చేయడం ఎవరూ ఊహించలేని విషయం. కానీ వేలాది రైతులతో కలిసి వచ్చి నల్ల జెండాలతో తప్పకుండా నిరసన తెలుపుమని తెలుగు రైతు సంఘం (తెదేపా అనుబంద సంఘం) అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. అది కూడా పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నుంచే!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి తెరాస ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ ఆయన ప్రధాని నరేంద్ర మోడీ సభలో నిరసన తెలపాలనుకొంటున్నారు. తెదేపా ప్రధాన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నిర్వాసితులకి భూసేకరణ చట్టం-2013 ప్రకారమే పరిహారం చెల్లించాలి. లేదా తెరాస ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.:123ని అందుకు అనుగుణంగా సవరించాలి. లేదా ఆ జి.ఓ.నే రద్దు చేయాలి. లేకుంటే మల్లన్నసాగర్ తో సహా రాష్ట్రంలో నలుమూలల నుంచి వేలాది రైతులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సభకి వచ్చి నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతాము,” అని హెచ్చరించారు.
తెదేపా-భాజపాలు మిత్రపక్షాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. తెదేపా పోరాటం తెరాస ప్రభుత్వంపైనే తప్ప కేంద్రప్రభుత్వంపై కాదు. మరి అటువంటప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సభలో నల్ల జెండాలతో నిరసనలు తెలపడం అంటే భాజపాకి, ముఖ్యంగా కేంద్రానికి ఎటువంటి సంకేతాలు పంపినట్లవుతుందో ఆలోచించకుండానే ప్రతాప్ రెడ్డి మాట్లాడినట్లున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఎవరూ ఆవిధంగా నిరసనలు తెలపడం అసాధ్యమే కావచ్చు కానీ అటువంటి ఆలోచన, ప్రకటన చేయడం కూడా తప్పుడు సంకేతాలు పంపినట్లే అవుతుంది. ఒకవేళ తెరాస ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయాలనుకొంటే అందుకు వేరే సందర్భం ఎంచుకోవచ్చు. ముఖ్యమంత్రి లేదా హరీష్ రావు పాల్గొనే సభలో తెదేపా ఎటువంటి నిరసనలు తెలియజేసినా ఇబ్బంది, ఇటువంటి అభ్యంతఃరాలు కూడా ఉండవు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ సభలో తెదేపా నల్లజెండాలు ప్రదర్శిస్తే, తెరాస ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టబోయి తెదేపాయే స్వయంగా ఇబ్బంది పడవచ్చు. పైగా అలాగ చేస్తే అది తెదేపా-భాజపాల స్నేహంపై ప్రభావం కూడా చూపే అవకాశం ఉంటుంది.