తెలంగాణా శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, సాగునీటి ప్రాజెక్టులకి వ్యతిరేకంగా తమ పార్టీ చేస్తున్న ఉద్యమాలని సమర్ధించుకొంటూ భలే పాయింట్ తీసి ముఖ్యమంత్రి కెసిఆర్ ని ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా జరుగుతున్న సమయంలో, తమ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తామంతా తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కి చాలా సహకరించామని చెప్పారు. తెరాస చేపట్టిన అనేక ఉద్యమాలకి, ధర్నాలకి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తుంటే, తామంతా ఆయనపై ఒత్తిడి తెచ్చి ఒప్పించేమని చెప్పారు. తామందించిన సహాకారం వలననే ఆనాడు మిలియన్ మార్చ్ కి ప్రభుత్వం అనుమతించిందని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. సకల జనుల సమ్మె, రైల్ రోకో వంటి కార్యక్రమాలలో అనేకమా నది కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొని అరెస్ట్ అయ్యి జైళ్ళకి వెళ్ళిన సంగతిని గుర్తు చేశారు.
ఆనాడు తెరాస ఉద్యమాలు విజయవంతం అవడానికి తామందరం అంతగా సహకరిస్తే, ఈనాడు అదే కెసిఆర్ ప్రభుత్వం తాము చేస్తున్న ఉద్యమాలని అణచివేయడం సమంజసమేనా? అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ‘ఛలో మల్లన్నసాగర్’ కార్యక్రమం పెట్టుకొని నిర్వాసితులని కలుసుకోవాలని బయలుదేరితే, పోలీసుల చేత అరెస్ట్ చేయించి చాలా క్రూరంగా, నిరంకుశంగా వ్యవహరించారని, కెసిఆర్ పాలనలో తెలంగాణాలో అసలు ప్రజాస్వామ్యం కనబడకుండా పోయిందని విమర్శించారు. కెసిఆర్ ఇలాగే నిరంకుశంగా వ్యవహరిస్తే, ప్రజలే ఆయనకి తగిన విధంగా బుద్ధి చెపుతారని షబ్బీర్ అలీ హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలు ఆనాడు తెలంగాణా ఉద్యమాలకి సహకరించారు కనుక ఇప్పుడు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేసే ఉద్యమాలని భరించాలని షబ్బీర్ అలీ కోరడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ప్రభుత్వం కూడా తమపై ప్రతిపక్ష పార్టీలు ఉద్యమించాలని, తద్వారా ప్రజలలో తమకి చెడ్డపేరు ఏర్పడాలని కోరుకోవు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, ఉద్యమాలు చేయడం కూడా సహజమే కనుక వాటి వలన తమకి ఇబ్బంది, నష్టం కలగనంతవరకు ప్రభుత్వాలు సహిస్తుంటాయి.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఆయన హయంలో తెలంగాణా ఉద్యామాల వలన ప్రభుత్వం దాదాపు స్తంభించిపోయింది. అయినప్పటికీ, అప్పటి పరిస్థితులు, వాటి తీవ్రత కారణంగా వాటిని సహించక తప్పలేదు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. పైగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఉద్యమాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ, వాటిలో తమ ఉనికిని చాటుకొని మనుగడని కాపాడుకోవాలనే తపన కూడా ఉంది. అవి ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నప్పటికీ తెరాస ప్రభుత్వం కూడా వాటిని కొంత వరకు సహించింది. కానీ వాటి వలన తమ లక్ష్యానికి ఆటంకం కలుగుతుందని భావించినప్పుడు, శాంతి భద్రతలని కాపాడవలసిన భాద్యత ప్రభుత్వానిదే. కనుక కెసిఆర్ మాత్రమే కాదు ఆయన స్థానంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా తప్పకుండా ఇలాగే వ్యవహరిస్తారు.