ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య వాద వివాదాలు ఎన్ని నడుస్తున్నా విధానాల పరంగా మాత్రం పోలికలు పెరుగుతున్నాయి. మల్లన్నసాగర్ భూ సేకరణ సమస్య ఆందోళనకారులపై ఇటీవల జరిగిన లాఠీచార్జి తీవ్ర నిరసనకు దారితీసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడి సమర్థించుకోవలసి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే విజయవాడలో విద్యార్థులపై తీవ్ర లాఠిచార్జి జరిగింది. ఇందులో ఒక అమ్మాయిని క్రూరంగా హింసిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో విస్త్రతంగా దర్శనమిచ్చింది. ఇదే సమస్యపై గతంలో తెలంగాణలోనూ లాఠిచార్జి జరిగింది. భూ సేకరణకు సంబంధించిన 2013 చట్టాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. ఎపిలో భూ సమీకరణ తతంగం జరుగుతుంటే తెలంగాణలో 123 పేరిట ఒకేసారి భూమిని కొనేసి పునరావాస బాధ్యత వదిలించుకోవడం విధానంగా వుంది. ప్రతిపక్షాల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడంలోనూ సేమ్ టు సేమ్. ముఖ్యమంత్రి మాత్రమే అన్ని నిర్ణయాలు తీసుకునే ఏకవ్యక్తి కేంద్ర విధానం కూడా రెండు చోట్ల కొనసాగుతున్నది. కెసిఆర్‌కు ఒక పిసరు భక్తి విశ్వాసాలు ఎక్కువగా వున్నా చంద్రబాబు నాయుడు కూడా క్రమేణా ఆ దోరణి పెంచడం కనిపిస్తుంది. ఇక కుమారుల పాత్రలోనూ పెద్ద తేడా లేదు. ఒకటికి రెండు సార్లు ఎంఎల్ఎగా నెగ్గి ఉద్యమంలో పాల్గొన్న కెటిఆర్ ఇప్పటికే మంత్రిగా హైర్ అప్పరెంట్గా ప్రతిష్టితులు కాగా లోకేష్ కూడా మంత్రి పదవి ఇంకా తీసుకోకున్నా నెంబర్ 1 ఎ గా చలామణి అవుతున్నారు. బిజెపితో సంబంధాల విషయానికి వస్తే టిడిపి భాగస్వామిగా వుంటే టిఆర్ఎస్ సానుకూల పాత్రకు పరిమితమవుతున్నది. చంద్రబాబు నాయుడు లాగే కెసిఆర్ కూడా హైటెక్ తరహాలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చేస్తారు. కెటిఆర్ అయితే అచ్చంగా హైటెక్ ప్రపంచాన్ని ఆవిస్కరిస్తుంటారు. కెసిఆర్ చంద్రబాబు ఇద్దరూ అధికార నివాసాలు మార్చడం పరిపాటి. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా వున్నాయి … కాని రాజకీయంగా మాత్రం ఉభయుల మధ్య వైరుధ్యాలు చాలా తీవ్రంగానే వుంటాయి. ఇక్కడ మాత్రం కెసిఆర్ రాజ్యంలో చంద్రబాబుకు అవసరం వున్నంత ఆయన రాజ్యంలో ఈయనకు పని వుండదు. పోర్టుల వినియోగం వంటి ఒకటి రెండు అంశాలు ఇందుకు మినహాయింపుగా వుంటాయి. రెండు రాష్ట్రాలు కలసి మెలసి వుండాలనే ప్రజలు కోరుకుంటారు. పోలికలు ఏమైనా ప్రజలకు మేలు చేసే దిశలో వుంటే మంచిది గాని లాఠీచార్జిలు భూ గ్రహణంలో వద్దని కూడా చెబుతారు.