ఎపికి ప్రత్యేక హౌదాపై చర్చకు రాజ్యసభ చైర్మన్ సమయం నిర్ణయించారు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తే ఏ ప్రత్యేకత వుండేట్టు లేదు. హౌదా నిధులు అన్నీ కావాలని అడుగుతామని అంటూనే పోరాడలేమని చేతులెత్తేశారు. అన్నిపార్టీలూ ఈ విషయంలో కృషి చేయాలన్నారు. పోరాటం అంటే కత్తులు కటార్లతోనో లేక దండయాత్రలతోనే జరగదని అందరికీ తెలుసు. రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ శక్తులన్నీ అంటే అన్ని పక్షాలూ కలసి కేంద్రాన్ని పదేపదే కోరడం, ఒత్తిడి తేవడం, నిరసన కార్యక్రమాలు నడపడం ఇదే పోరాటం. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నాటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాసు, కర్ణాటకలో రామకృష్ణహెగ్దే వంటివారు ఈ తరహా కార్యక్రమాలెన్నో చేయడం చంద్రబాబుకు స్వయంగా తెలుసు. అయినా పదే పదే పోరాటం చేయబోమని ప్రకటిస్తున్నారంటే కేంద్రంతో ఏదో అవగాహన వుందనుకోకతప్పదు. రెండేళ్లలో నిధులు వచ్చింది అంతంత మాత్రమే ప్యాకేజీల ప్రసక్తి లేదు. అయినా సరే ఆశ పెట్టుకుంటూ అభ్యర్థనలతో సరిపెడదామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్నిబట్టి చూస్తే రాజ్యసభలో ఈ చర్చ వాదోపవాదాలతోనే ముగిసిపోతుందని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓటింగు వరకూ తీసుకురాకుండా మూజువాణితో సరిపెట్టవచ్చు. బిజెపి కాంగ్రెస్‌పై దాడి చేసి చట్టంలో లేనందవల్ల చేయలేకపోయామని వాదించవచ్చు. తెలుగుదేశం హౌదా కావాలంటూనే కాంగ్రెస్‌పై దాడి కేంద్రీకరించి విభజన నాటి వాదనలు వినిపించవచ్చు. ఈ మధ్యలో గందరగోళం గజిబిజి కూడా రావచ్చు. అప్పుడు వాయిదా అస్త్రం వుండనే వుంటుంది. చర్చ జరగలేదనే నింద తొలగించుకోవడానికి ఫలితం లేకుండా పని పూర్తిచేయడానికి అవసరమైనదే అక్కడ చూస్తాం.