ప్రతిపక్ష పార్టీల ఒత్తిడితో రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ఈరోజు చర్చ జరుగబోతోంది. ఆ చర్చలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పాల్గొని దానిపై స్పష్టత ఇవ్వడానికి అంగీకరించారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రెండేళ్ళలో కేంద్రప్రభుత్వం ఏవిధంగా, ఎంత సహాయం చేసింది ఆయన వివరిస్తారు. దీనిపై సభలో మధ్యాహ్నం రెండు గంటల తరువాత చర్చ జరుగుతుంది. ఈ ప్రత్యేక చర్చ కోసం తెదేపా, వైకాపా సభ్యులు ఈరోజు ఉదయం నోటీస్ ఇస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచన మేరకే ఇది జరుగబోతోంది కనుక వారి నోటీసులని ఆయన స్వీకరించి చర్చకి అనుమతిస్తారు.
ఈ చర్చలో ఆర్ధిక మంత్రి జైట్లీ సమాధానం బట్టి కెవిపి రామచంద్ర రావు హోదా కోసం ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఉపసంహరించుకోవాలా వద్దా..అని నిర్ణయించుకొంటారు. విశేషమేమిటంటే, ఆ బిల్లుని ద్రవ్యబిల్లుగా పరిగణిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ద్రవ్యబిల్లులపై జరిగే చర్చలకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు కనుకనే కేంద్రం దానిని ఆ కేటగిరిలోకి చేర్చినట్లు భావించవచ్చు. కనుక చివరికి దానిని చెత్తబుట్టలో పడేయబోతున్నట్లు కేంద్రం చెప్పకనే చెప్పినట్లు భావించవచ్చు.
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదని, రాష్ట్రానికి అంతకు మించి చాలా రెట్లు ఎక్కువ సహాయం చేశామని కేంద్రప్రభుత్వం పదేపదే చెప్పుకొంటోంది కనుక ఈరోజు జరిగే చర్చలో పాల్గొనబోతున్న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఏమి చెప్పబోతున్నారో తేలికగానే ఊహించవచ్చు. అందరూ ఊహిస్తునట్లుగానే, ఈ చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగిన తరువాత, అరుణ్ జైట్లీ ఏపికి చేసిన సహాయం గురించి మళ్ళీ మరోమారు ఏకరువు పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పకుండా 14వ ఆర్ధిక సంఘం పరిశీలనలో ఉందని చెపుతారు. అప్పుడు సభలో ప్రతిపక్షాలు మళ్ళీ ఆందోళనకి దిగుతాయి. వెంటనే సభని రేపటికి వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటిస్తారు.
కెవిపి పెట్టిన బిల్లుని ద్రవ్యబిల్లుగానే పరిగణిస్తున్నామని కేంద్రం తేల్చి చెప్పినప్పుడే దాని గతి ఏమవుతుందో తేలిపోయింది కనుక కెవిపి దానిని ఉపసంహరించుకోకపోయినా కేంద్రప్రభుత్వానికి ఎటువంటి భయం, నష్టం లేదు. ఆగస్ట్ 5న దానిపై ఓటింగ్ జరిగినపుడు దానిని అదే సాకుతో కేంద్రం తిరస్కరించవచ్చు.
అంతిమంగా తేలేదేమిటంటే, ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో అన్ని పార్టీలు గట్టిగా పోరాడుకొని…దానిపై కేవలం తమ పార్టీకి మాత్రమే ఆసక్తి, చిత్తశుద్ధి ఉన్నాయని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ చర్చ పనికి వస్తుంది. అందుకే ప్రతిపక్ష పార్టీలు సభలో ఈవిధంగా డ్రామా ఆడుతున్నాయని జైట్లే ఆరోపిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వాటి కంటే తమకే ఎక్కువ అభిమానం ఉందని అందుకే ప్రత్యేక హోదా కంటే చాలా ఎక్కువగానే సహాయం చేస్తున్నామని చెప్పుకొంటారు. కనుక ఈ చర్చని అధికార ప్రతిపక్షాలు ప్రత్యేక క్రెడిట్ కోసం జరుగుతున్న పోరాటమేనని భావించవచ్చు. దీని వలన ఆ పార్టీలకి తప్ప రాష్ట్రానికి, ప్రజలకి ఒరిగేదేమీ ఉండదు. ప్రత్యేక హోదా రాదు.