మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు నోరు విప్పినా బెడిసికొడుతూనే ఉంటుంది. అందుకు కారణం ఆయన ఏనాడూ తెలంగాణా ఉద్యమాలలో పాల్గొనకపోయినా, తెరాస అధికారంలోకి రాగానే తెదేపాలో నుంచి తెరాసలోకి దూకేసి మంత్రి అయిపోవడమే. తెరాస ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ నేటికీ తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగడం మరో తప్పు. ఆ కారణంగానే ఆయన ఎప్పుడు దేని గురించి మాట్లాడినా, వెంటనే ప్రతిపక్షాలు చాలా ఘాటుగా బదులిస్తుంటాయి. బహుశః ఆయన ఎప్పటికీ ఈ సమస్యని ఎదుర్కోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలపై ఆయన స్పందిస్తూ, “అవసరమైతే ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ జైళ్ళలో వేసైనా సరే ప్రాజెక్టులు పూర్తి చేస్తాము,” అని అన్నారు. మంత్రిగా ఉంటూ ప్రతిపక్ష పార్టీల గురించి ఆవిధంగా మాట్లాడటం చాలా తప్పని అర్ధమవుతూనే ఉంది. మిగిలిన మంత్రులు అందరూ ఈ గొడవకి దూరంగా ఉంటున్నప్పుడు తలసాని కూడా దూరంగా ఉంటే సరిపోయేది. లేదా “ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మిస్తామని” చెప్పినా సరిపోయేది. కానీ వాటి కోసం ప్రతిపక్ష పార్టీల నేతలని జైళ్ళలో వేయడానికి కూడా వెనకాడమని చెప్పడమే తప్పు. అందుకు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ మాజీ ఎంపి మధు యాష్కీ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ఉద్యమాలలో ఆయన పాల్గొనకపోగా, ఉద్యమాలు చేస్తున్న వారిపై ఆయన దాడులు చేసేవారు. అటువంటి తెలంగాణా ద్రోహి నేడు మంత్రి అయిపోయారు. పైగా ప్రాజెక్టులని అడ్డుకోవడం తప్పని తెలంగాణావాదులకి సుద్దులు చెపుతున్నారు. ఆయన దౌర్న్యాలు అప్పుడు ఇప్పుడూ కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి అయిన తరువాత అది ఇంకా పెరిగిపోయింది. ఆయన అవినీతి భాగోతాలు బయటపెడితే ప్రజల ముందు తలెత్తుకొని తిరుగలేరు,” అని మధు యాష్కీ తీవ్రంగా విమర్శించారు.
తలసాని కుమారుడు సెటిల్ మెంట్లు, దౌర్జన్యాలు చేస్తున్నట్లు ఆ మద్యన మీడియాలో వార్తలు వచ్చినప్పుడు తలసాని సంజాయిషీలు ఇచ్చుకోవలసి వచ్చింది. బహుశః మధు యాష్కీ వాటిని దృష్టిలో పెట్టుకొనే ఆయన దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అంటున్నారేమో?