ప్రత్యేక హోదా విషయంలో ఎవరిది తప్పు? అంటే “మీదంటే..కాదు మీదే తప్పు” అని అని మన రాజకీయ పార్టీలు వాదించుకొంటాయి. కానీ తిలా పాపం తలో పిడికెడు అన్నట్లుగా ఆ పాపంలో అన్ని పార్టీలకి భాగం ఉందని అందరికీ తెలుసు. అయినా అవి ఒకదానినొకటి విమర్శించుకోవడం మానవు. ఎందుకంటే, దానిని తమకి రాజకీయ మైలేజ్ ఇచ్చే అంశంగా మాత్రమే భావిస్తున్నాయి కనుక. అందుకే దానితో తమ ప్రత్యర్దులని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటాయి. అందుకే అవన్ని కలిసి ప్రత్యేక హోదా సాధించుకొందామని ఏనాడూ ఆలోచించవు. రాష్ట్రానికి, ప్రజలకి మేలు కలిగించవలసిన ప్రత్యేక హోదా అంశం అందుకే రావణకాష్టంలాగ రగులుతూనే ఉంటుంది.
వైకాపా అధికార ప్రతినిధి పార్ధసారధి దీని గురించి మాట్లాడుతూ తెదేపాని నిందించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి తెదేపా అనుసరిస్తున్న ద్వంద వైఖరే కారణమని, అది డిల్లీలో ఒకలాగ, రాష్ట్రంలో మరొకలాగా వ్యవహరిస్తుంటుందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కెవిపి రామచంద్ర రావు ప్రైవేట్ బిల్లు పెడితే దానికిటెడ్ మద్దతు ఇస్తే సరిపోయేది. కానీ సాంకేతిక కారణాలతో ప్రత్యేక హోదా కోసం తెదేపా మరో బిల్లుని ప్రవేశపెట్టింది. అది కెవిపి పెట్టిన బిల్లుని అడ్డుకోవడానికేనని అర్ధమవుతోంది. ప్రత్యేక హోదాని సాధించవలసిన రాష్ట్ర ప్రభుత్వమే అది రాకుండా ఈవిధంగా అడ్డంకులు సృష్టిస్తుండటం చూస్తే, అది రాష్ట్రానికి అన్యాయం చేయడానికి కంకణం కట్టుకొందా? అందుకే అది అధికారంలోకి వచ్చిందా? అని అనేమానం కలుగుతోంది. ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా కృషి చేయాలి,” అని పార్ధ సారధి తెదేపాకి హితవు పలికారు.
తెదేపాని తప్పు పడుతున్న వైకాపాకైనా ప్రత్యేక హోదా సాధించాలనే తపన, చిత్తశుద్ధి ఉందా? అంటే లేదనే చెప్పుకోవలసి వస్తుంది. దాని కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నప్పటికీ వైకాపా ఏనాడూ దానికి మద్దతు ఈయలేదు. ఆ తరువాత నటుడు శివాజీ పోరాటానికి కూడా అది మద్దతు ఈయలేదు. సుమారు ఏడాది పాటు దాని గురించి మాట్లాడేందుకే జగన్ ఇష్టపడలేదు. ఏమంటే ప్రతీ చిన్న అంశంపై సోనియా గాంధీ మాట్లాడుతారా? అలాగే నేను కూడా అని వాదించేవారు. దాని గురించి పార్లమెంటులో మావాళ్ళు మాట్లాడుతున్నారు కనుక నేను మాట్లాడవలసిన అవసరం లేదనేవారు. రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకి వచ్చినప్పుడు వైకాపాని విమర్శించిన తరువాత నుంచే జగన్ దాని కోసమే పోరాటాలు మొదలుపెట్టారు. కానీ వాటిని అర్ధాంతరంగా నిలిపివేశారు. దాని గురించి కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీస్తూ, ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా గురించి పట్టుపడుతుంటారు.
ఈవిధంగా వైకాపా కూడా ద్వంద వైఖరి అవలంభిస్తూ మళ్ళీ తెదేపాని నిందించడం దేనికి? అందరూ అందరే..ఈ విషయంలో ఎవరికీ చితశుద్ధి లేదనే సంగతి ప్రజలకి తెలుసు.