వేర్వేరు స్ధాయిల్లో నామినేటెడ్ పదవులకు అర్హులైన వారి పేర్లను, అర్హతలను, పార్టీకి ప్రజలకు చేసిన సేవల వివరాలను జులై ఆఖరులోగా ఇవ్వాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలను, జిల్లా ఇన్ చార్జ్ లను పార్టీ ఆదేశించింది.
నియోజకవర్గాల సంఖ్య పెంచడం వీలుపడదని రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించడంతో పదవులు ఆశిస్తున్న తెలుగుదేశం పాత, కొత్త నాయకుల్లో వత్తిడి పెరిగింది.
దీనికి తోడు తెలుగుదేశం పార్టీ గత నెలలో నిర్వహించిన సర్వే ప్రకారం 45 శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీకి పాస్ మార్కులు కూడా రాలేదని, 30 నియోజకవర్గాల్లో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయని చంద్రబాబు నాయుడు పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో చెప్పారు. అయితే ఆ నియోజకవర్గాల పేర్లను మాత్రం వెల్లడించలేదని కమిటీ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు ”గడపగడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో కూడా రాష్ట్రప్రభుత్వం పని తీరు తెన్నులపట్ల పెరుగుతున్న వ్యతిరేకత బయటపడుతోంది.
ఏ ఒక్కనియోజకవర్గంలోకూడా తెలుగుదేశం వెనుకబడి వుండకూడదన్నది చంద్రబాబు లక్ష్యం. దీన్ని సాధించణానికి నామినేటెడ్ పదవుల్లో నాయకులను నియమించి వారిద్వారా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు పంపే ప్రతిపాదనలను పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఫిల్టర్ చేసి, ప్రాధాన్యతా క్రమంలో జాబితాలు రూపొందిస్తారు. రకరకాల సమీకరణలను బేరీజువేసి నియామకాలపై చంద్రబాబు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు.