ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ దేశాల మద్య యుద్దవాతవరణం నెలకొని ఉంది. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ కి నిరసనగా కాశ్మీరులో అల్లర్లు చెలరేగడం, వాటికి పాక్ సహకరించి, మద్దతు తెలపడం, అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ పై ఒత్తిడి చేయడం, కాశ్మీర్ పాకిస్తాన్ దేనని మళ్ళీ పాతపాట గట్టిగా పాడుతుండటం వంటివి భారత్-పాక్ సంబంధాలని దెబ్బ తీశాయని చెప్పవచ్చు. ఆ కారణంగా ఇరు దేశాలమద్య పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో, ఆగస్ట్ 3,4 తేదీలలో ఇస్లామాబాద్ లో సార్క్ సమావేశాలు జరుగబోతున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ సమావేశాలలో పాల్గొనబోతున్నారు.
దక్షిణాసియా దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవడం, ఉగ్రవాద నిర్మూలన, ప్రధాన లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకొన్న సార్క్ సమావేశాలు మొట్టమొదటిసారిగా 2006, మే 11న డాకాలో, ఆ మరుసటి సంవత్సరం డిల్లీలో జరిగాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడూ ఒక్కో దేశంలో వాటిని నిర్వహిస్తున్నారు. ఈసారి ఉగ్రవాదులకి ప్రధాన కేంద్రంగా తయారైన పాకిస్తాన్ లోనే నిర్వహిస్తున్నారు. దానిలో పాల్గొని పాక్ ప్రేరిత ఉగ్రవాదం గురించి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లడబోతున్నారు. పాకిస్తాన్ కూడా కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడటం ఖాయం. కనుక ఈ సమావేశాలు ఈసారి కొంచెం వాడిగావేడిగా సాగే అవకాశం ఉంది.
2006లోనే సార్క్ ని ఏర్పాటు చేసుకొన్నప్పటికీ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో నిత్యం ఎక్కడో అక్కడ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. వారి చేతుల్లో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉండటం గమనిస్తే సార్క్ తన ప్రధాన లక్ష్యాలలో ఒకటైన ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని స్పష్టం అవుతోంది. అయితే ఇటువంటి వేదికల ద్వారానే అటువంటి సమస్యలపై చర్చించి, పాకిస్తాన్ వంటి దూర్తదేశానికి అందరూ కలిసి బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంటుంది కనుక సార్క్ పూర్తిగా నిరుపయోగమని కూడ చెప్పలేము. గత ఆరు దశాబ్దాలుగా పాకిస్తాన్ తీరులో ఎటువంటి మార్పు రానప్పుడు ఇంకెప్పటికీ వస్తుందని ఆశించలేము కూడా.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయ్యింది. పాకిస్తాన్ తో స్నేహం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. అంతేకాక, భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నట్లుగా పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. కాశ్మీరులో అల్లర్లకి పాక్ తోడ్పడింది. ఇప్పుడు కాశ్మీర్ తమదేనని మళ్ళీ వాదిస్తోంది. దాని చర్యలన్నీ భారత్ కి తీవ్ర నష్టం కలిగిస్తూ, భారత్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగానే ఉన్నాయి. కనుక భారత్ కూడా తదనుగుణంగానే దాని పట్ల నిర్దిష్టమైన విధానాలు రూపొందించుకొని వాటిని ఖచ్చితంగా అమలుచేయక తప్పదు. నానాటికీ పెట్రేగిపోతున్న పాక్ పట్ల భారత్ ఇంకా మెతక వైఖరి అవలంభించవలసిన అవసరం ఏమాత్రం లేదు.