ఉమ్మడి హైకోర్టుని తక్షణమే విభజించాలని తెలంగాణా ప్రభుత్వం ఒత్తిడి పెంచినప్పుడు, అంతకంటే ముందు షెడ్యూల్: 9,10 క్రింద ఉండే ఉమ్మడి సంస్థలని విభజించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పారు. నిజానికి గత రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు దానికోసం తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు కానీ అది పట్టించుకోలేదు. హైకోర్టు విభజనకి అదే ప్రధాన అవరోధంగా నిలిచిందనే సంగతి గ్రహించిన గవర్నర్ నరసింహన్, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీతో దాని గురించి మాట్లాడారు. ఆయన ప్రతిపాదనలకి వారు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రప్రభుత్వం ఏమి చేయదలచుకొందని తెదేపా ఎంపి సిఎం రమేష్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఆస్తుల పంపకాల కోసం తమ శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అది విభజన, పంపకాల ప్రక్రియని చోస్తోందని సమాధానం చెప్పారు.
హైకోర్టు విభజనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని, తెలంగాణా ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ, ఆ ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి అది కూడా కారణమేనని చంద్రబాబు నాయుడు నిరూపించినట్లయింది. హైకోర్టు విభజన, ఉమ్మడి సంస్థల విభజనతో ముడిపడి ఉన్నందున ఇకపై ఆ కమిటీకి తెలంగాణా ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందించవచ్చునని భావించవచ్చు. ఆ విషయం రానున్న రోజులలో స్పష్టం అవవచ్చు. దాని పురోగతిని బట్టి ఈ ఏడాది చివరిలోగా హైకోర్టు విభజన జరుగుతుందో తేలిపోవచ్చు. ఒకవేళ జరుగకపోతే ఈసారి చంద్రబాబు నాయుడుని ఎవరూ నిందించలేరు కూడా.