ఈ మధ్య కాలం లో చిన్న సినిమా గా ‘పెళ్ళిచూపులు’.. ఆహ…! ఎంత చక్కటి తెలుగు టైటిల్… ఈ సినిమా పోస్టర్స్ తో ట్రైలర్‌తో బాగా ఆకర్షించిన మరొక చిత్రం లేదేమో అనిపిస్తుంది. నిర్మాతలకు ఈ సినిమా పై ఎంత నమ్మకం అంటే, విడుదలకు ముందుగానే సినీ పాత్రికేయులకు ప్రివ్యూ ఏర్పాటు చేయడం తో అర్ధం అవుతుంది. విజయ్ దేవరకొండ (ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్) రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ ప్రివ్యూ చూశాక ఈ సమీక్షను మీకందిస్తున్నాం. నిజానికి ఈ చిత్రం ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా రాజ్ కందుకూరి, యాష్ రంగినేని లు నిర్మించారు. అయితే ప్రముఖ నిర్మాత డి .సురేష్ బాబు మంచి ఆఫర్ ఇచ్చి తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలుగు సినిమాకు ఓ రిఫ్రెషింగ్ ప్రేమకథగా పెళ్ళిచూపులు నిలుస్తుందన్న ప్రచారానికి తగ్గట్టే సినిమా కూడా ఉందా? ముందుగానే చిత్రాన్ని చూపించిన నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతుందో చూద్దాం..
కథ :
ఈ జనరేషన్ కి తగిన ప్రశాంత్ (విజయ్ దేవరకొండ).. సరదాగా కాలం వెళ్ళదీసే ఇంజనీర్ చదుకున్న ఓ యువకుడు. తన ఆలోచనలకు తగ్గట్టుగా ప్రశాంత్ ఓ చెఫ్‌గా పనిచేయాలని అనుకుంటాడు. ప్రశాంత్ చదువుకు తగినట్టు మంచి ఉద్యోగం లో స్థిరపడాలని తండ్రి కోరిక. కానీ ప్రశాంత్ కి ఇష్టం ఉండదు. ఇక జీవితం పట్ల ఎటువంటి స్పష్టత లేనట్లు కనిపించే అతడికి పెళ్ళి చేస్తే అయినా అన్నీ కుదురుతాయని చిత్ర (రీతూ వర్మ) అనే అమ్మాయితో అతడి తండ్రి పెళ్ళి నిశ్చయిస్తాడు. అయితే చిత్ర తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అతనితో పెళ్ళిని నిరాకరిస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు చేస్తుండగా, వాళ్ళ దగ్గర్నుంచి కూడా ప్రశాంత్‌కి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కునేందుకే చిత్రతో కలిసి ప్రశాంత్ ఫుడ్ బిజినెస్ మొదలుపెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? చివరకు వీరి కథ ఎక్కడివరకు వచ్చిందీ? అన్నదే మిగతా సినిమా.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :
విజయ్ దేవరకొండ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. అతడికిది రెండో సినిమాయే అంటే ఎక్కడా నమ్మలేనంతగా తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు.డైలాగ్ డెలివరీ, కామెడీ సన్నివేశాలతో బాగా ఆకట్టుకున్నాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కునే ఇండిపెండెంట్ అమ్మాయిగా, రీతూ వర్మ తన నటనతో కట్టిపడేసింది. సినిమాకు రీతూను ఓ మేజర్ హైలెట్ గా చెప్పొచ్చు. అనీష్ కురివెల్లకు కూడా నటుడిగా మంచి మార్కులు వేయొచ్చు. ఇక మిగతా సపోర్టింగ్ నటులంతా చాలా బాగా నటించారు.
సాంకేతిక వర్గం :
ఫస్ట్ దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి చెప్పుకోవాలి. ఓ రచయితగా, ఓ దర్శకుడిగా ఈ సినిమా విషయంలో నిజానికి తరుణ్ చూపిన ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఫస్టాఫ్‌లో రచయితగా తరుణ్ చాలాచోట్ల ఓ స్థాయి సెట్ ఈ విషయం లో తరుణ్ మ్యాజిక్ చేశాడనే చెప్పుకోవచ్చు. ఇలాంటి రొమాంటిక్ కామెడీకి ఎంత వరకు స్క్రిప్ట్ అవసరమో అంతే వాడుకున్నాడు. ఏయే సన్నివేశాలు ఎలా తీస్తే ఎలాంటి ఫలితాలు చూపిస్తాయో తరుణ్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే రుజువు చేసుకున్నాడు. ఈతరం ఆలోచనలను సరిగ్గా బంధిస్తూ, వాళ్ళ భావోద్వేగాల చుట్టూ ఓ సరికొత్త కథ చెప్పాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేం. నగేష్ బెగెల్లా సినిమాటోగ్రఫీ అదిరిపోయేలా ఉంది. ఈ సినిమా కున్న బడ్జెట్లో ఈ స్థాయి విజువల్స్ రావడమంటే మాటలు కాదు. ఈ విషయంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ మూడు విభాగాల సమన్వయం బాగా కుదిరింది అనుకుంటా! అద్భుతంగా ఉంది. నగేష్ బెగెల్లా తన సినిమాటోగ్రఫీతో సినిమాకు ఓ సరికొత్త ఫీల్ తీసుకురాగలిగాడు. వివేక్ సాగర్ అందించిన పాటలు ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సినిమా బడ్జెట్ ఒక కోటి లోపే కానీ చిత్రాన్ని చూస్తే ఈ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఊహించడం కూడా అసాధ్యమే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూస్తే ఇలా అన్ని విభాగాలూ ఎవరికి వారు సపోర్ట్ చేసుకున్నారనిపిస్తుంది.
విశ్లేషణ :
సినిమా రంగానికి ఒక కొత్త దర్శకుడి సినిమా వస్తోందంటే, సినీ పరిశ్రమే కాకుండా, ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే, కొత్తగా వచ్చేవారే మొదటి సినిమాతోనే తామేంటో నిరూపించుకోవాలన్న ఉత్సాహంతో సరికొత్త కథలను పట్టుకొస్తుంటారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు వస్తున్నా, ప్రేక్షకులు కోరుకునే నచ్చే సినిమాలు అరుదే! తాజాగా కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ చేసిన ప్రయత్నం ‘పెళ్ళిచూపులు’, చాలా అరుదుగా వచ్చిన సినిమా ఇది. తాజా కథ, కథనాలు; ప్రేమ, పెళ్ళి, కెరీర్పైన ఈతరం ఆలోచనలు; వీటన్నింటినీ ఎంటర్టైనింగ్గా చెప్పగలిగే సన్నివేశాలు; దేనికవే నిర్ధిష్టంగా కనిపించే పాత్రలు.. ఈ చిత్రం లో వున్నా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరో దగ్గర్నుంచి మొదలుకొని ప్రతి పాత్రకూ ఓ అవసరం, అర్థం ఉండడం, కథ పూర్తిగా ముందే తెలిసిపోయేలా ఉండడం గురించి, ఇంత కొత్తదనమున్న అంశాలతో వచ్చిన ఈ సినిమా ఫస్ట్సె హాఫ్ ఇచ్చిన కిక్ సెకండా హాఫ్ లో ఇవ్వలేదు, స్పీడ్ తగ్గడంతో ఇదో మైనెస్స్ గా చెప్పొచ్చు. చివరాఖరున చెప్పేదేంటంటే. మన జీవితం లో ‘పెళ్ళిచూపులు’ ఎలాంటి మంచి అనుభూతినిస్తాయో? ఈ చిత్రం చూసి అలాంటి ఫీల్ ని అనుభవించవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే ఇష్టపడే వారికి ఈ తరహా సినిమా అంతగా నచ్చకపోవచ్చు.
తెలుగు360.కామ్ రేటింగ్ 3.25/5
బ్యానెర్లు :ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్;
నటి నటులు : విజయ్ దేవరకొండ (ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్) రీతూ వర్మ, నందు తది తరులు…
సినిమాటోగ్రఫీ : నగేష్ బెగెల్లా,
సంగీతం : వివేక్ సాగర్,
ఎడిటింగ్ : రవి తేజ గిరజాల ,
సమర్పణ : డి .సురేష్ బాబు,
నిర్మాతలు : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని, వినూత్న గీత,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తరుణ్ భాస్కర్,
విడుదల తేదీ : 29.07.2016