ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత అనుకూలుడు. ప్రత్యేకించి మార్గదర్శి వ్యవహారంలో కాంగ్రెస్ అజెండాకు అనుకూలంగా పని చేస్తూ ఈనాడు అధినేత రామోజీ రావును ముప్పుతిప్పలు పెట్టడం ద్వారా ఉండవల్లి ఏపీ కాంగ్రెస్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో అయితే ఉండవల్లి విజయాన్ని తన ప్రతిష్టగా తీసుకున్నాడు వైఎస్. అలా సాగుతున్న ప్రయాణంలో వైఎస్ మరణం అనే కుదుపుతో చాలా మార్పులు వచ్చాయి. వైఎస్ తనయుడు జగన్ కు ఉండవల్లి కి దూరం పెరిగింది. పక్కా కాంగ్రెస్ నేతలా వ్యవహరించాడు ఉండవల్లి.
ఇక 2014 ఎన్నికలు మరో కుదుపు. దీంతో ఇప్పుడు ఈయన జగన్ కు అనుకూల వాయిస్ వినిపిస్తున్నాడు. స్వతహాగా లాయర్ అయిన ఉండవల్లి.. జగన్ పై నమోదైన కేసులు కూడా నిలవవు అని స్పష్టం చేస్తున్నాడు. అవన్నీ కూడా అధిష్టానం పెట్టించినవే అని అంటున్నాడు. జగన్ పై కేసులు వద్దని, అరెస్టు చేయించవద్దని తను అప్పట్లోనే అధిష్టానానికి స్పష్టంగా చెప్పానని కూడా అరుణ్ కుమార్ చెబుతున్నాడు. అలాగే ఉండవల్లి వైకాపాలో చేరాతాడనని కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట.
అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఉండవల్లి వైకాపాలో చేరడానికి డీల్ అంత సులభంగా కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఎలాగూ ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటేంత స్థాయి ఇప్పుడు ఉండవల్లికి లేదు. రాజమండ్రి నియోజకవర్గంలో ఇప్పుడు పాత పరిస్థితులు లేవు. ఇక ఏమున్నా నామినేటెడ్ పదవి కావాలి. ఆల్రెడీ ఎంపీ స్థాయి కాబట్టి ఉండవల్లిని రాజ్యసభకు పంపాలి. మరో రెండు సంవత్సరాల వరకూ జగన్ కు ఆ అవకాశం లేదు. రెండేళ్ల తర్వాత కూడా అన్నీ అనుకూలంగా ఉంటే వైకాపాకు దక్కేది ఒక రాజ్యసభ పదవి. అప్పటికి ఆ విషయంలో ఎంతమంది పోటీదారులు తయారవుతారో.. అసలు ఆ సీటును సొంతం చేసుకునే అవకాశం ఉంటుందో ఉండదో! అంటే వైకాపాలో చేరడం వల్ల ఉండవల్లికి వెంటనే పదవులు దక్కే అవకాశాలు ఏవీ లేవు! మరి పదవి దక్కే అవకాశం లేదని తెలిసినా ఉండవల్లి వైకాపాలో చేరతాడా అనేది సందేహమే! సో ప్రస్తుతానికి ఈ మాజీ ఎంపీ వైకాపాలో చేరే అవకాశాలు తక్కువే!