గత రెండు మూడు వారాలుగా ఎవరి నోట విన్నా కబాలి మాటే. కబాలి విడుదలకు ముందు ఎంతగా మాట్లాడుకొన్నారో, కబాలికి నెగిటీవ్ టాక్ వచ్చిన తరవాత కూడా అంతకంటే ఎక్కువే మాట్లాడుకొన్నారు. ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్ల ఉధృతి చూసి, అభిమానులు సైతం ముక్కుమీద వేలేసుకొన్నారు. అదీ… రజనీ సత్తా అంటూ కాలర్లు ఎగరేస్తున్నారు. తొలి మూడు రోజుల వసూళ్లలో గత రికార్డులన్నీ చెరిపేసింది కబాలి. సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అయ్యాయి గానీ, లేదంటే రూ.500 కోట్లను కొట్టేసేదే. బయ్యర్ల మాట ఎలా ఉన్నా.. ఈ సినిమాతో మాత్రం నిర్మాత బాగానే సొమ్ము చేసుకొన్నట్టు స్పష్టం అవుతోంది. అయితే ఈ సినిమాకి రజనీ పారితోషికం ఎంత తీసుకొన్నాడు? అనే ఆసక్తికరమైన చర్చ నెలకొంది. సౌతిండియాలోనే రజనీది అత్యధిక పారితోషికం. ఈ విషయంలో రజనీకి కొట్టేవాడే లేడు. అయితే కబాలితో బాలీవుడ్ స్టార్స్‌ని సైతం దాటుకెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సినిమా మొదలెట్టకముందే… రజనీకి రూ.50 కోట్లు ముట్టాయని, బిజినెస్ భారీ ఎత్తున జరిగాక మరో పది కోట్లు అందాయని మొత్తానికి రూ.60 కోట్ల రూపాయల్ని పారితోషికంగా తీసుకొన్నాడని తెలుస్తోంది. అదే నిజమైతే.. రజనీ ఆల్ ఇండియా రికార్డ్ కొట్టేసినట్టే.