ఏపికి ప్రత్యేక హోదా, తదితర హామీల అమలుపై ప్రస్తుతం రాజ్యసభలో చర్చ జరుగుతోంది. దానిలో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలు, పార్టీల ఎంపిలు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది మోడీ ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల సభ్యులు ఏపికి గట్టిగా మద్దతు ఇచ్చారు. ఏపితో బాటు దేశంలో వెనుకబడిన 10 రాష్ట్రాలని కూడా కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమ బెంగాల్ కి చెందిన సభ్యుడు కోరారు.
మొదట ఈ చర్చని ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ ఆనాడు తమ ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను, ఏపికి ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో ఆనాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు. అప్పుడు వెంకయ్య నాయుడు ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు ఇవ్వాలని కోరిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన ఆరు హామీలలో రెండు మాత్రం కేంద్రప్రభుత్వం నెరవేర్చిందని మిగిలినవి ఎప్పుడు నెరవేరుస్తుందో, అసలు ఆ ఉద్దేశ్యం ఉందో లేదో తెలుపాలని కోరారు.
తెదేపా ఎంపి సిఎం రమేష్ మాట్లాడుతూ ఆనాడు మోడీ, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఎన్డీయే అభ్యర్దులకి ఓట్లు వేసి గెలిపించారని, కానీ రెండేళ్ళయినా ప్రత్యేక హోదా తదితర హామీలని అమలు చేయకపోవడం వలన అందరూ చంద్రబాబుని నిందిస్తున్నారని, కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కోరారు. ఆనాడు మోడీ తిరుపతి, విశాఖలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రాజధాని నిర్మాణంతో సహా అన్ని హామీలని పునరుద్ఘాటించారని, కానీ ఇంతవరకు వాటిని అమలుచేయకపోవడంతో రాష్ట్ర ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నామని, కనుక ఇప్పటికైనా ఆ హామీలని అమలుచేయాలని అన్నారు.
దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు తిరిగినన్నిసార్లు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, డిల్లీలో ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి ఉండరని, ఇంత శ్రమపడుతున్నా ఫలితం కనబడటం లేదని, పైగా ఆయన అనుభవం అంత వయసు కూడా లేని ప్రతిపక్ష నేతల చేత నానామాటలు పడవలసి వస్తోందని, కనుక ఇప్పటికైనా హామీలు అమలుచేయాలని చేతులెత్తి జోడించి ప్రార్ధిస్తున్నానని అన్నారు.
వైకాపా ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, కెవిపి ప్రవేశపెట్టిన బిల్లుని ద్రవ్యబిల్లుగా చెప్పడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ దీనిని ద్రవ్యబిల్లుగా పరిగణిస్తే, ఈ సభలో ప్రవేశపెట్టె ప్రతీ బిల్లుకి కూడా ఏదో రూపంలో ఆర్ధిక అంశాలతో ముడిపడే ఉంటుంది కనుక అప్పుడు సభలో దేనిని చర్చించడం సాధ్యం కాదని అన్నారు. మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఆనాడు సభలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయకపోవడం అంటే అది రాజ్యాంగ ధిక్కారంగానే భావించవలసి ఉంటుందని అన్నారు. ఏపి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదని అన్నారని విమర్శించబోతుంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ అడ్డుకొన్నారు. సభలో లేని వ్యక్తిపై విమర్శలు చేయడం తగదని వారించారు. విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక హోదా కోసం గత రెండేళ్లుగా తమ పార్టీ పోరాడుతూనే ఉందని, అది వచ్చే వరకు ఇంకా పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.
ఈ ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టిన కెవిపి రామచంద్ర రావు గొంతు సమస్య కారణంగా మాట్లాడటానికి చాలా ఇబ్బందిపడుతున్నప్పటికీ చాలా కష్టపడి మాట్లాడారు. విభజన చట్టంలో, ఈ సభలో మాజీ ప్రధాని ఇచ్చిన హామీలని అమలుచేయకుండా తప్పించుకోవడానికి సాంకేతిక అంశాలు, చట్టాలని, వాటిలో లోపాలని వాడుకోవడానికి ప్రయత్నించవద్దని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆవిధంగా చేస్తే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. తన బిల్లుని ఉపసంహరించుకొంటున్నానని వస్తున్న వార్తలలో నిజం లేదని చెప్పారు.
ఆయన అడిగిన ప్రశ్నకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ సమాధానం చెపుతూ ఆగస్ట్ 5న ఆ బిల్లుపై చర్చ ముగిస్తామని చెప్పగానే కెవిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లుపై ఓటింగ్ జరుగాలని అందరూ కోరుతుంటే, దానిని ముగిస్తానని ఏవిధంగా చెపుతున్నారని ప్రశ్నించారు.
ఆ బిల్లు ఇప్పుడు రాజ్యసభ స్వంతమైయింది కనుక దానిని సభ ఆమోదిస్తే ఓటింగ్ నిర్వహిస్తానని లేదా సభ ఏవిధంగా నిర్ణయిస్తే ఆవిధంగా చేస్తానని వివరణ ఇచ్చారు. కానీ ఆయన జవాబులోనే ఆ బిల్లుకి ఏగతి పట్టబోతోందో స్పష్టం అయ్యింది. ఇతర రాష్ట్రాల సభ్యులు తమ రాష్ట్రాలకి కూడా ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక సహాయం కావాలని సభలో గట్టిగా కోరాయి కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి దానినే సాకుగా చూపింఛి తప్పుకొనే ప్రయత్నం చేస్తుందేమో?