మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణా సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావుని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా అందరూ ఒంటరిగా వదిలిపెట్టేసి బలిపశువుని చేశారని మీడియా అభిప్రాయపడింది. కానీ దానిని తన సమర్ధతని నిరూపించుకొనేందుకు వచ్చిన ఒక గొప్ప అవకాశంగా స్వీకరించి, ఆయన ఒంటరి పోరాటం చేశారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలని ఎదుర్కొంటూ, మరోపక్క రైతులని ఒప్పిస్తూ శరవేగంగా తనకి అప్పగించిన క్లిష్టమైన భూసేకరణ పనిని పూర్తి చేస్తున్నారు.
ఆ ప్రాజెక్టు క్రిండ్ ముంపుకి గురయ్యే 8 గ్రామాలలో ఐదింట్లో భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. భూసేకరణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏటిగట్టు కిష్టాపూర్ గ్రామంలో రైతులని కూడా ఒప్పించి 1,000 ఎకరాలు సేకరించగలిగారు. పల్లె పహాడ్, ఎర్రవెల్లి గ్రామల ప్రజలతో ఆయన జరిపిన చర్చలు ఫలించడంతో ఆ రెండు గ్రామాలలో కూడా భూసేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. దీనితో మొత్తం 8 గ్రామాలలో రైతులందరినీ భూసేకరణకి ఒప్పించి హరీష్ రావు ఒంటి చేత్తోనే ఈ విజయం సాధించినట్లయింది.
పార్టీలో, ప్రభుత్వంలో అందరూ ఆయనని ఒంటరిగా వదిలేసినా ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా చాలా తెలివిగా, చురుకుగా వ్యవహరిస్తూ తనకి అప్పజెప్పిన పనిని విజయవంతంగా పూర్తిచేస్తున్నారు కనుక ఈ క్రెడిట్ పూర్తిగా ఆయనకీ, ఆయనకి సహకరించిన స్థానిక ఎమ్మెల్యేలకే దక్కుతుంది. సమస్యలు, సవాళ్ళలలో నుంచి కూడా అవకాశాలు వెతుకొంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. హరీష్ రావు అది చేసి చూపించి తన సత్తా చాటుకొంటున్నారు.
తనపై నమ్మకం ఉంచి భూములు ఇస్తున్న రైతులందరికీ హరీష్ రావు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొని, ముంపు గ్రామాలన్నిటినీ తానే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆయన రాజకీయ జీవితంలో ఇది ఒక పెద్ద అగ్నిపరీక్ష వంటిదే. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించడం ద్వారా ఆయనని ఈ పరీక్షలో వారే గెలిపించినట్లు చెప్పవచ్చు. కనుక వారికి ఆయన ఎప్పటికీ రుణపడే ఉంటారు. వారికి ఇచ్చిన హామీలని అన్నిటినీ ఖచ్చితంగా నిర్దిష్ట సమయంలోగా అమలుచేస్తే వారి రుణం తీర్చుకొన్నట్లే. అప్పుడు రైతులు కూడా చాలా సంతోషిస్తారు. అయన పేరుప్రతిష్టలు, విశ్వసనీయత కూడా పెరుగుతుంది.