ఆందోళన చేయడం, డిమాండ్ సాధనకు నినాదాలు చేయడం, హైవేలను దిగ్బంధించడం వేరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సజావుగా పరిపాలన చేయడం వేరు. ఏది ముందు, ఏది వెనక అనే స్పష్టత చాలా ముఖ్యం. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రాధాన్యాల విషయంలో అయోమయానికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా యూనివ్సిటీల వైస్ చాన్స్ లర్ల నియామకం విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం జరిపిన నియామకాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తెచ్చిన జీవోను నిలిపివేసింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్లు విద్యార్థులు. ఉద్యమంతో పాటు వాళ్లకు చదువు కూడా ముఖ్యమే. విశ్వవిద్యాలయ పాలన సాఫీగా జరగాలంటే వైస్ చాన్స్ లర్ తప్పనిసరి. కేసీఆర్ ప్రభుత్వం రెండేళ్ల పాటు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరెన్నిసార్లు గుర్తు చేసినా మొండిగా వ్యవహరించింది. చివరకు, తన ఇష్టారీతిన వీసీలకు నియమించడానికి అనుకూలంగా ఓజీవోను తెచ్చింది. గవర్నర్ అనుమతి అవసరం లేకుండానే నియామకాలు జరపానికి తనకు తానే అనుమతి ఇచ్చుకుంది.
అంతేకాదు, వీసీగా నియామకం పొందాలంటే కావాల్సిన కనీస అర్హతల విషయంలోనూ ఉదారంగా మినహాయింపులు ఇచ్చింది. ప్రొఫెసర్ గా కనీసం పదేళ్ల బోధనానుభవం ఉండాలనే నిబంధనను సడలించింది. ఐదేళ్లు చాలని జీవో తీసుకు రావడం వల్ల విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పడిపోతాయని పిటిషనర్ వాదించారు.
అన్నింటికీ మించి, రెండేళ్ల పాటు యూనివర్సిటీల పాలనను పట్టించుకోని ప్రభుత్వం, సరిగ్గా మొన్న హైకోర్టులో విచారణకు వచ్చే రోజే ఆగమేఘాల మీద వీసీలను నియమించింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లు ఆగినవాళ్లు ఓ నాలుగు రోజులు ఆగలేకపోయారా అని ప్రశ్నించింది. ఏంచేయాలో మాకు తెలుసని స్పష్టం చేసింది. చివరకు నియామకాలను రద్దు చేసింది. విద్యా వ్యవస్థపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వం, ఇక ముందైనా జాగ్రత్తగా, తగిన ప్రాథమ్యాల ప్రకారం పనిచేస్తుందేమో చూద్దాం.