రాష్ట్ర విభజన సమయంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు రెండూ తనకి రెండు కళ్ళ వంటివని, రెండు ప్రాంతాలకి సమన్యాయం జరగాలని వాదించినప్పుడు, కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయనని చాలా ఎద్దేవా చేశాయి. దానిపై చాలా వ్యంగ్యంగా మాట్లాడాయి. కానీ ఆ తరువాత, ఆయనని ఎద్దేవా చేసిన వారే చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాలు తమకి రెండు కళ్ళ వంటివని ఎప్పుడో అప్పుడు చెప్పుకొంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్దాంతాన్ని విమర్శించిన వారిలో కాంగ్రెస్ ఎంపి రేణుక చౌదరి కూడా ఒకరు. ఆమె కూడా నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళవంటివని చెప్పుకొన్నారు.
ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నిన్న జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, “తెలంగాణా ప్రజల ఆకాంక్ష మేరకు మా ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినప్పటికీ, విభజన చట్టంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాము. ఎందుకంటే మా పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళ వంటివి కనుక. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతోందని భావించే మళ్ళీ ఇప్పుడు మా పార్టీ ఎంపి కెవిపి రామచంద్ర రావు ద్వారా ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రైవేట్ బిల్లు పెట్టింది. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మేము వాగ్దానం చేస్తే, దానిని అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? ఇదేలాగ ఉందంటే దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్లుంది. ఇప్పటికైనా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాము,” అని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీది కూడా రెండు కళ్ళ సిద్దాంతమే అని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, తన స్వంత నేతల పట్ల ఆ పార్టీ అధిష్టానం ఎంత అనుచితంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజల, కాంగ్రెస్ నేతల అభిప్రాయాలకి ఏమాత్రం విలువ, గౌరవం ఇవ్వకుండా పార్లమెంటు తలుపులు మూసి, ఆనాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ చుట్టూ ఉత్తరాది కాంగ్రెస్ ఎంపిలని కాపలాగా పెట్టి మరీ విభజన బిల్లుని ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల భవిష్యతే కాకుండా, తన స్వంత పార్టీ నేతల, తన స్వంత పార్టీ భవిష్యత్ ని కూడా పణంగా పెట్టి మరీఆడిన రాజకీయ జూదంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతీసారి రెండు రాష్ట్రాలలో ప్రజలు దానికి అండగా నిలబడి, నెత్తిన పెట్టుకొని మోశారు. అందుకు బదులుగా కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని చాలా దారుణంగా అవమానించింది. అందుకే దానికి ప్రజలు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. ఆ విభజన ప్రక్రియని పర్యవేక్షించిన జైరాం రమేష్, “తొందరపడి రాష్ట్ర విభజన చేయడం కాంగ్రెస్ చరిత్రలో జరిగిన అతి పెద్ద పొరపాటు” అని అన్నారు. కానీ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏమి ప్రయోజనం? అలాగే చేయకూడనివి అన్నీ చేసి చేతులు దులుపుకొన్నాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది కూడా రెండు కళ్ళ సిద్దాంతమే అని చెప్పుకోవడం దేనికి?