తెలంగాణాలో వైకాపా ప్రస్తానం ఎప్పుడూ కూడా ఒక అంతుబట్టని మిష్టరీగానే సాగుతుంటుంది. ఒకప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపా, తెరాస, భాజపాలకి ధీటుగా నిలబడిన వైకాపా, విభజన సమయంలో జగన్మోహన్ రెడ్డి పూరించిన సమైక్య శంఖారావంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక తెలంగాణాలో వైకాపా దుఖాణం బంద్ అయిపోయినట్లేనని అందరూ భావిస్తున్న సమయంలో మళ్ళీ పార్టీని నిర్మించుకొని నిలబడింది కానీ ఏనాడూ మిగిలిన ప్రతిపక్ష పార్టీలలాగ ప్రజా సమస్యలపై పోరాడింది లేదు..తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేసిందీ లేదు. కానీ గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకి మద్దతు ఇవ్వడం, ఓటుకి నోటు కేసులో తెరాసకి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా గట్టిగానే మాట్లాడి తన ఉనికిని చాటుకొంది. ఆ మద్యన వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలలో వైకాపా పోటీ చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి, రోజా అక్కడకి వెళ్లి ప్రచారం చేసి తమ పార్టీ ఉనికిని గట్టిగా చాటారు.
కానీ మళ్ళీ రెండు మూడు నెలల క్రితం వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏకైక ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏకైక ఎమ్మెల్యే వెంకటేశ్వరులు తెరాసలోకి జంప్ అవడంతో వైకాపా మళ్ళీ మూతపడినట్లు కనబడింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చశారు. ఆ తరువాత జిల్లా స్థాయిలో కమిటీలు కూడా నియమించుకొన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ మద్యన తెలంగాణా వైకాపా నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ, వారిని తెరాస ప్రభుత్వంతో పోరాటాలకి సిద్దం చేస్తున్నారు.
ఆయన నిన్న పార్టీ మహిళా విభాగం నేతలతో లోటస్ పాండ్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి, కెసిఆర్ అసమర్ధ, అవినీతి పాలన గురించి మహిళా నేతలు తెలంగాణాలో గడప గడపకి వెళ్లి ప్రజలని, ముఖ్యంగా మహిళలని చైతన్యపరచాలని కోరారు. కెసిఆర్, కెటిఆర్ ఇద్దరూ ప్రజలని మభ్యపెట్టడానికే రకరకాల పధకాలు ప్రకటిస్తూ వాటిని అమలుచేయకుండా మోసం చేస్తున్నారని అయన విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, ఈ-పంచాయితీలలో 10,000 మంది మహిళలకి ఉద్యోగాలు వంటి హామీలు అన్నీ హామీలుగానే మిగిలిపోయాయని ఆ సమావేశంలో పాల్గొన్న మహిళా నేతలు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి అందరూ కలిసి తెరాస ప్రభుత్వంతో పోరాడుదామని ఆ సమావేశంలో నిర్ణయించుకొన్నారు.
వారు నిజంగానే పోరాడితే అది చాలా ఆసక్తికరమైన మార్పు అనే చెప్పవచ్చు. వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో రెండు రోజులు నిరాహార దీక్ష చేసినప్పటి నుంచి తెరాస ప్రభుత్వం పట్ల వైకాపా వ్యతిరేకత ప్రదర్శించడం మొదలైన్నట్లు కనబడుతోంది. అది జగన్ మనసాక్షి వంటి సాక్షి మీడియాలో కూడా ప్రతిబింబిస్తూనే ఉంది. కానీ ఇంతకాలం తెరాసకి..దాని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వైకాపా ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు వ్యతిరేకిస్తోందో తెలియదు కానీ అందుకు బలమైన కారణం ఏదీ కనబడటం లేదు. కనుక తెరాస పట్ల వైకాపా ‘ప్రదర్శిస్తున్న’ ఈ వ్యతిరేకత నిజమైనదేనా కాదా అనేది మున్ముందు కాలమే చెపుతుంది.