వైకాపా ఎంపి విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో ఏపికి ప్రత్యేక హోదా తదితర అంశాలపై జరుగుతున్న చర్చలో పాల్గొంటూ 14వ ఆర్ధిక సంఘం పాత్ర గురించి చాలా చక్కగా వాదించారు. అది ఆర్ధిక అంశాలలో కేంద్రప్రభుత్వానికి తగిన సలాహాలు, సూచనలు ఇచ్చే సంస్థే తప్ప స్వయంగా నిర్ణయాలు తీసుకొనే అధికారాలు దానికి ఉండవని అన్నారు. కనుక అది అనుమతించలేదనే సాకుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ వంటి హామీలని అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం తప్పించుకోవడం సబబు కాదని వాదించారు.
కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకి సమాధానాలు చెపుతూ, ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీ, ఆర్ధిక ప్యాకేజి, వెనుకబడిన ప్రాంతాలకు అధనపు నిధులు మంజూరు వంటి అనేక హామీల అమలుకి 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేయడం లేదనే సాకు చూపి తప్పించుకొనే ప్రయత్నం చేసినప్పుడు, విజయసాయి రెడ్డి ఆయనకి ఈవిధంగా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ, హామీల అమలు విషయంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చాలా స్పష్టతతోనే ఉన్నారు కనుక సభ్యుల ఒత్తిడికి, విమర్శలకి లొంగకుండా ప్రతీ ప్రశ్నకి గణాంకాలతోనే జావాబులు చెప్పి తప్పించుకొన్నారు.
కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు నిన్న సభలో మాట్లాడుతూ, గణాంకాలు, సాంకేతిక కారణాలు, విభజన చట్టంలో లోపాలని అడ్డుపెట్టుకొని హామీలని అమలుచేయకుండా తప్పించుకొనే ర్పయట్నం చేయవద్దని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కానీ ఇవ్వాళ్ళ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సరిగ్గా అదే విధంగా తప్పించుకొన్నారు. అయితే పార్లమెంటులో తప్పించుకోగలిగినా రేపు ఎన్నికల సమయంలో ప్రజల నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? అని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దుస్థితి కలిగిందో, మళ్ళీ వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతోందో కేంద్రప్రభుత్వం కళ్ళారా చూస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకొనే ప్రయత్నంలోనే నేడు రాజ్యసభలో ప్రతిపక్ష బెంచీలలో నిలబడి కేంద్రప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు అది చూసయినా భాజపా మేల్కొనకపోతే ఎవరికీ నష్టం?