స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ శనివారం సాయంత్రం నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరు కాలేదు. స్వాతంత్ర్య వేడుకలు జరిపిన తర్వాత సాయంత్రం వేళ రాజ్ భవన్లో గవర్నర్ ఎట్ హోం పేరుతో తేనీటి విందు ఇవ్వడం నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులను దీనికి ఆహ్వానిస్తున్నారు.
ఈ ఆనవాయితీ ప్రకారం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబు నాయుడులను గవర్నర్ ఆహ్వానించారు. కానీ వీరిద్దరూ రాలేదు. ఈసారి ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలూ రాలేదని, అందుకు కారణాలు ఉండి ఉండొచ్చని గవర్నర్ మీడియాలో ఉన్నారు. దీనిని భూతద్దంలో చూడొద్దని సూచించారు. ఏవో అనివార్య కారణాల వల్లే వారు రాకపోయి ఉంటారని, ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూడవద్దని అన్నారు. ముఖ్యమంత్రులతో తనకు ఎలాంటి వివాదాలు లేవన్నారు. ఎప్పుడూ ఇద్దరు ముఖ్యమంత్రులూ వివాదాలకు అతీతంగానే ఉంటారని, తనకు ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా సత్సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యమే. అయితే కొన్ని సందర్భాల్లో ఇద్దరూ రాజ్ భవన్లో ఎదురు పడటం, ప్రత్యేక చర్చలో పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కావడం వారికి అభ్యంతరం ఉండదని అనుకున్నారు. అయితే ఏ కారణాల వల్ల వారు హాజరు కాలేదనేది మాత్రం వెల్లడి కాలేదు. ఒకరు వస్తారని మరొకరు గైర్హాజర్ అయి ఉంటారా అనే ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి. లేక నిజంగానే అనివార్య కారణాల వల్ల రాలేక పోయి ఉంటారేమో అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.