కెజి బేసిన్‌లో వెలికితీసే సహజ వాయువును ముందుగా ఆంధ్రప్రదేశ్ అవసరాలకు వినియోగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ సమావేశంలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.. అయితే, ఇదే విషయాన్ని విలేకరులు ప్రశ్నించినపుడు మరోసారి మాట్లాడతానని దాటవేశారు.
రెండేళ్ళ అన్వేషణ తరువాత భారత్, అమెరికా శాస్త్రవేత్తలు కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గరుకు ఇసుకతో ఉన్న భూ పొరల్లో ఈ గ్యాస్ హైడ్రేట్ల నిల్వలను భారీగా గుర్తించారు. 33 లక్షల కోట్ల రూపాయల విలువైన 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలను వెలికితీసే అవకాశం ఉందన్నది ఈ అన్వేషణ బయటపెట్టింది. ఇసుక పొరల్లో ఉండే గ్యాస్ హైడ్రేట్ల నుండి సహజ వాయువును వెలికి తీయడంలో కొన్ని సమస్యలున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటం సానుకూల అంశం!
సహజవనరుల ప్రయోజనం దేశ ప్రజలందరికి అందాలన్నది నిర్వి వాదాంశమే, త్యాగాలు చేస్తూ కష్ట నష్టాలు భరించే స్థానికులకు వాటి ఫలితాలు ముందుగా అందాలన్నది అంతే వివాద రహితం! అయితే, కెజి బేసిన్ నుండి వెలికి తీసున్న నిక్షేపాల్లో మాత్రం ఈ దిశలో చర్యలు శూన్యం! ఆంధ్రప్రదేశ్ వెలికితీస్తున్న సహజ వాయువు ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు నామమాత్రంగా అందకపోవడం విచారకరం! ఇక్కడి నుండి తరలిస్తున్న సహజ వాయువును సూదూర రాష్ట్రాల్లో పైప్‌లైన్ల ద్వారా ప్రజలకు అందిస్తూంటే రాష్ట్రం మాత్రం ప్రకటనలకే పరిమిత మైంది.
గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విషయంలో గట్టి పోరాటమే చేసినా ఫలితం లేకుండా పోయింది. రిలయన్స్ పలుకుబడి ముందు వైఎస్ ప్రయత్నాలు విఫలమైనాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బిజెపి పెద్దలకు రిలయన్స్‌తో ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే. రిలయన్స్ నిర్వహిస్తున్న గ్యాస్ క్షేత్రానికన్నా పది రెట్లు అధికమైన నిక్షేపాలు తాజాగా బయట పడటంతో రాష్ట్రానికి ఇచ్చేదేమిటో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది.
అయితే ఈ శుభవార్త ఎవరికంటే అన్నీ అనుమానాలే! చంద్రబాబు దాటవేత ధోరణి కూడా అనుమానాలను దృవపరుస్తోంది. ఈ ప్రయోజనాలు ప్రజలకా, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకా లేక కార్పొరేట్ సంస్థలకా అన్నదే ప్రశ్న. కెజి బేసిన్‌లో ఇప్పటికే రిలయన్స్ గట్టిగా విస్తరించింది. తాజా పరిణామంతో మరికొన్ని సంస్థలూ కెజి బేసిన్‌కు వస్తాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటన ప్రకారం ఒకటి, రెండు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు కెజి బేసిన్‌కు ప్రవహించనున్నాయి.
ఆ తరువాత సంవత్సరాల్లో ఈ పెట్టుబడులు మరింతగా పెరగనున్నాయి. అంటే కోనసీమను మరింత ముప్పులోకి తోసెయ్యడమే! బ్లోఅవుట్‌లు, లీకేజీలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత స్ధితిలోకి స్థానిక ప్రజలను నెట్టడమే. పర్యావరణ సమస్యలను మరింతగా పెంచుకోవడమే!
వారి జీవితాలతోనూ, ఆరోగ్యాలతోనూ చెలగాటమాడటమే! లాభాలను తరలించుకు పోవడంపై చూపించిన శ్రద్ధలో అణు మాత్రమైనా సామాజిక భద్రత, పర్యావరణ పరిరక్షణపైనా చూపని కార్పొరేట్ సంస్థలకు ఈ సహజ వనరులు అప్పగిస్తే జరిగే ముప్పు అది. ఈ ధోరణిని వదిలించుకుని, స్థానికుల భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ శాశ్వత ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, ఆ దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉంది. సహజ వనరుల వల్ల కార్పొరేట్ లాభాలు కాకుండా ప్రజలు ప్రయోజనం పొందే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం.