ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఇంతకు ముందు చాలాసార్లు కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పింది. అదే మళ్ళీ నిన్న మరొకమారు రాజ్యసభలో చెప్పింది. కేంద్రప్రభుత్వం మాట తప్పినందుకు అందరూ ఆగ్రహంతో ఉన్న మాట నిజమే. కానీ కేంద్రప్రభుత్వం వారి ఆగ్రహాన్ని పట్టించుకొనే స్థితిలో లేదిప్పుడు. ఆవిధంగా వ్యవహరిస్తే ఏమవుతుందో దానికీ తెలుసు, ప్రజలకీ తెలుసు కానీ అది పట్టించుకోవడం లేదు. అది పట్టించుకోకపోయినా ఇప్పుడు ప్రజలు చేయగలిగిందేమీ లేదు.
ప్రత్యేక హోదా కోసం గత రెండేళ్ళుగా ధర్నాలు, బంద్ లు సభలు, సమావేశాలు, పార్లమెంటులో వాదోపవాదాలు అన్నీ జరిగాయి. కానీ వాటి వలన ఏ ఫలితం రాలేదు. కనుక దాని కోసం మళ్ళీ మరోమారు రాష్ట్రంలో బంద్ పాటించడం వలన రాజకీయ పార్టీలకి ఏమైనా మైలేజ్ లభిస్తుందేమో గానీ ప్రత్యేక హోదా మాత్రం రాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఏపికి హోదా ఇవ్వమని నిన్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించిన తరువాత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగస్ట్ 2న రాష్ట్ర బంద్ పాటించి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. అది ప్రత్యేక హోదా కోసమేనని చెపుతున్నారు. నిజమే కావచ్చు. కానీ దాని వలన ప్రత్యేక హోదా రాదు… కేంద్రప్రభుత్వ వైఖరి మారదని ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పుడు బంద్ కి పిలుపునివడం రాజకీయ మైలేజ్ కోసమేనని అనుమానించక తప్పదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. అది నిజమే కావచ్చు. కానీ ఆయన చేస్తున్న పనేమిటి? కేంద్రంతో పోరాడకుండా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్దం అవుతున్నారు. కారణం చంద్రబాబు నాయుడు ఆయన బద్ధ శత్రువు కనుక. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రానికి చాలా నష్టపోతుందని వాదిస్తున్న వైకాపా రాష్ట్ర పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా తరచూ ఈవిధంగా బంద్ లు , ధర్నాలు చేస్తూనే రాష్ట్రం ఇంకా నష్టపోదా?
ప్రత్యేక హోదా వస్తే కలిగే లాభాల సంగతేమో గానీ రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఈవిధంగా ఏదో ఒక సాకుతో నిత్యం బంద్ లు, ధర్నాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి, అరాచక పరిస్థితులు సృష్టిస్తుంటే దాని వలననే రాష్ట్రానికి రావాలనుకొంటున్న పరిశ్రమలు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని ప్రత్యేక హోదా కూడా పూడ్చలేకపోవచ్చు. ఈ బంద్ ల వలన ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సమస్యలలో ఉన్న రాష్ట్రానికి ఇంకా చాలా నష్టం కలుగుతుంది.
ప్రజలు విజ్ఞులు కనుకనే తమని దెబ్బ తీసిన కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేక హోదా, ఇతర హామీలని అమలుచేయకపోతే దానికి ఎవరరిని శిక్షించాలో ప్రజలే నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికలలో ప్రజలే తగినవిధంగా బుద్ధి చెపుతారు. ఒకవేళ కాంగ్రెస్, వైకాపాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈవిధంగా వ్యవహరిస్తే అవి కూడా ఈ తప్పులో పాలుపంచుకొంటున్నట్లే అవుతుంది. అప్పుడు ప్రజలు వాటికీ తగిన విధంగా బుద్ధి చెపుతారు. కనుక ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లతో రాజకీయ పార్టీలు చెలగాటం ఆడాలని చూస్తే వాటికే ప్రమాదం అని గ్రహించి రాష్ట్రానికి నష్టం కలిగించే ఇటువంటి బంద్ ఆలోచనలు మానుకొనే అందరికీ మంచిది.