ఆంధ్ర ప్రదేశ్‌కు తామే చెప్పిన ప్రత్యేకహాదా కల్పించే అవకాశం తోసిపుచ్చుతూ అరుణ్‌జైట్లీ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గతంతో పోలిస్తే కేంద్రం వైఖరిని తప్పు పట్టిన మాట నిజమే. కాని వారు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తే ఆయన సుతిమెత్తగా బాధకలిగించందనే మాటతో సరిపెడుతున్నారు. కాంగ్రెస్ నాటకాలను అంత తీవ్రంగా విమర్శించడం బాగానే వుంది గాని బిజెపి నాటకాలను ఖండించడం ఇప్పుడు ముఖ్యం కదా? మీడియా గోష్టి బాధ పడటంతో ఆగిపోవడం బాధాకరమే. రాష్ట్రంపై అంత చర్చ జరిగిన తర్వాత ఆయనే అన్నట్టు అవమానం మిగిలిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించకపోతే ప్రజలు సహించరు. గాయపడిన ఎపి ప్రజలే అసలే భరించరు. కేంద్రం విశ్వాసఘాతుకం పైన ఇప్పటికే నిరసనలు మొదలైనాయి. ఆయనలో కనిపిస్తున్నంత తటపటాయింపు, రాజకీయ జమాఖర్చులు ప్రజలకు ప్రతిపక్షాలకు అవసరం వుండదు. హడావుడి విభజనకు తోడు హామీలతో ఓట్లు వేయించుకున్నవారు వాటిని తిరస్కరించారన్న భావం తీవ్రాగ్రహానికి దారితీయడం సహజం. నిధులు సంస్థల మంజూరు గురించి ఇంతకాలం బిజెపి నేతలు కేంద్ర మంత్రులు గొప్పలు చెబుతుంటే ఎప్పటికప్పుడు నిజానిజాలు వెల్లడించడానికి ఎందుకు సంకోచించారు? ఒక ప్రభుత్వ పదవీ కాలం సగంపైగా అయిపోతుంటే అవసరాలు హామీల గురించి వత్తిడి చేసేందుకు ఎందుకు వెనుకాడారు? . రాష్ట్రం కోసం అందరినీ కలుపుకొని కేంద్రాన్ని గట్టిగా అడగడానికి అభ్యంతరాలేమొచ్చాయి? ఇప్పుడు రాజ్యసభలో 11 పార్టీలు హౌదాను బలపర్చాయని అంటున్న చంద్రబాబు ఆ పార్టీల రాష్ట్ర శాఖలసహాయం తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడలేదు? సీతారాం ఏచూరి మాటలను స్వాగతించారు గాని ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్టాడుతున్నారు కదా! కాంగ్రెస్ డ్రామాలను ఖండించడం తప్ప మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలైనా చెప్పడం లేదే? రాజకీయ పరమైన ప్రశ్నలు వేస్తే మీడియాకు కూడా దురుద్దేశ్యాలు, స్వార్థ ప్రయోజనాలు అంటకడుతున్నారే గాని బిజెపిని పల్లెత్తుమాట అనడానికి సిద్దంగా లేరు.అరుణ్‌జైట్లీని తప్ప వెంకయ్య నాయుడు పేరెత్తడానికి కూడా సిద్ధంకారు. కనుక అనివార్యమైన తక్షణ స్పందనగా మాట్లాడ్డం తప్ప తెలుగుదేశం వైఖరిలో ఎలాటి మార్పు వుండబోదని చంద్రబాబు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. బాధ కలిగిందంటూ సరిట్టారే గాని భవిష్యత్ కార్యాచరణ కనీసంగా సూచించలేదు. కేంద్రం మీద ఆశపోయిందని అనకుండా ఇంకా అన్ని ఆప్షన్లు వున్నాయంటే బిజెపితో కలసి ముందుకుసాగుతూ ఇలాగే వేడుకోళ్లతో మరికొంత కాలం గడిపేస్తారన్నమాట. ఆయన సర్దుకోవచ్చు గాని ప్రజల్లో మాత్రం ఈ తిరస్కరణ తీవ్ర నిరసనకు దారితీయడం ఖాయం.