కృష్ణా పుష్కరాల కోసం విజయవాడ వచ్చే భక్తుల సౌకర్యార్ధం, అధికారులు చేపట్టిన రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం కోసం అనేక ఆలయాలని తొలగించినప్పుడు మిత్రపక్షమైన భాజపాతో సహా ప్రతిపక్షాలు, హిందూ సంస్థలు, పీఠాదిపతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు మరో వివాదం చెలరేగింది. రోడ్లు వెడల్పు చేయడం కోసం రోడ్డు మధ్యలో నెలకొల్పిన రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు నిన్న రాత్రి తొలగించడంతో వైకాపా నేతలు వంగవీటి రాధ, కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు పార్ధ సారధి, ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు అక్కడికి చేరుకొని అధికారులతో ఘర్షణ పడ్డారు. ఆ సందర్భంగా వారికీ, పోలీసులకి మద్య తోపులాట జరిగింది. ఆ కారణంగా ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డికి ఉన్న పేరు ప్రతిష్టలు, ప్రజాభిమానం చూసి ఓర్వలేకనే ఆయన విగ్రహాన్ని తొలగించిందని వారు విమర్శించారు. అందుకు తగిన శాస్తి అనుభవించక తప్పదని హెచ్చరించారు.
స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రజాభిమానం, పేరుప్రతిష్టలని ఎవరూ కాదనలేరు. ఆ కారణంగానే ఆయన ఆకస్మికంగా మృతి చెందిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజలే ఆయన విగ్రహాలు నెలకొల్పారు. అవి నిజమైన అభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. కానీ ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చేసి వైకాపాని ఏర్పాటు చేసుకొని దానిని బలపరుచుకొనేందుకు తన తండ్రి పేరు చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్రలు చేపట్టారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో వందలాది విగ్రహాలని ఆవిష్కరించారు. వాటిని నెలకొల్పడం తప్పు కాదు కానీ ఆయన పేరు ప్రతిష్టలని, ఆయన మృతి కారణంగా ప్రజలలో ఏర్పడిన సానుభూతిని వైకాపాకి అనుకూలంగా మలుచుకొనేందుకే ఏర్పాటు చేస్తునందున అప్పట్లోనే చాలా అభ్యంతఃరాలు వ్యక్తం అయ్యాయి.
మొదట ప్రజలే స్వచ్చందంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు నెలకొల్పినప్పుడు ఎదురు కాని వ్యతిరేకత తరువాత ఎందుకు ఎదురయ్యాయి అంటే వాటిని రాజకీయ ఉద్దేశ్యంతోనే ఏర్పాటు చేయడం వలననే అని చెప్పక తప్పదు. అయితే ఆయన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నందున, ఆయన విగ్రహాల స్థాపనకి ఎక్కడా ఆటంకం ఏర్పడకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక విగ్రహాలు వెలిసాయి.
ఏదైనా ఒక పరిమితిలో ఉన్నంత కాలమే దానికి విలువ, గౌరవం ఉంటాయి. ఈ సూత్రం ఒక్క రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకే కాదు అందరికీ, అన్ని పార్టీలకీ కూడా వర్తిస్తుంది. తెలంగాణా ఉద్యమాలు, సమైక్య ఉద్యమాల సందర్భంగా చాలా గొప్పగొప్ప వ్యక్తుల విగ్రహాలే ద్వంసం అయ్యాయి. భారతదేశం గర్వించదగ్గ మహనీయుల విగ్రాహాలు హుస్సేన్ సాగర్ మురికి నీటి పాలయ్యాయి.
ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు విజయవాడలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని రాజకీయ దురేదేశ్యంతోనే తొలగించారా లేక నిజంగానే రోడ్లు వెడల్పు చేయడానికే తొలగించారా? అనే విషయం పక్కన పెడితే, ఏదైనా అతిగా చేస్తే ఏమవుతుందో తెలుసుకోవడానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తుంది. ఒకవేళ రేపు వైకాపా అధికారంలోకి వస్తే అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలని కూడా ఇదే విధంగా తొలగించవచ్చు..అప్పుడు తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేయవచ్చు. అదేమీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. కనుక మనం చాలా గౌరవించేవాళ్ళ విగ్రహాలు ఈవిధంగా ఎక్కడ పడితే అక్కడ నెలకొల్పకపోవడం ద్వారానే వారి గౌరవాన్ని కాపాడుకోగలమని అన్ని రాజకీయ పార్టీలు గ్రహిస్తే మంచిది.