ప్రత్యేక హోదా అంశంపై ప్రజలకు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎంత ఇబ్బందిపడుతున్నాయో, దాని గురించి రాష్ట్రంలో నానాటికీ ఉదృతమవుతున్న పోరాటాల గురించి అందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్ సభలో ప్రత్యేక హోదా గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను త్వరలోనే డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో దీని గురించి మాట్లాడుతానని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వ ఉప కార్యదర్శి ఆశిష్ దత్తా మరో బాంబు పేల్చారు.
ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి వ్రాసిన లేఖకు ఆశిష్ దత్తా వ్రాసిన జవాబులో ‘ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రణాళికా కమీషన్ నిర్దేశించిన లక్షణాలేవీ లేవని కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్స్ : 46(2) మరియు 94(1) ప్రకారం ఏపీలో పారిశ్రామిక, ఆర్దికాభివృద్ధికి అవసరమయిన ప్రోత్శాకాలన్నీ చేర్చబడ్డాయి. అవ్వనీ ఆర్ధికశాఖ పరిశీలనలో ఉన్నాయి. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని ప్రోత్సాహకాలు 2020 వరకు అమలులో ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసేందుకు అవసరమయిన లక్షణాలు లేవు కనుక ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక హోదాని పరిశీలనలోకి ప్రభుత్వం తీసుకోలేదు. కానీ కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పధకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని రాష్ట్రంలో ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చును. అందుకు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉంది,” అని వ్రాసారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకొక మాట చెపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలు కూడా కేంద్రప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైకాపా ఈనెల 29న రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమయిన లక్షణాలేవీ లేవంటూ కేంద్రప్రభుత్వం ఉప కార్యదర్శి వ్రాసిన లేఖ పార్సిల్ బాంబులాగే ప్రేలడం తధ్యం. వైకాపాతో బాటు మిగిలిన రాజకీయ పార్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దాడి చేసేందుకు ఇదొక దివ్యాస్త్రంగా పనికి వస్తుంది. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు తమ పోరాటాలను మరింత ఉదృతం చేయవచ్చును.
సున్నితమయిన ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించేప్రయత్నాలు చేయకుండా ఈవిధంగా కేంద్రప్రభుత్వం నియమనిబంధనలు, లక్షణాలు గురించి పేర్కొంటూ ప్రత్యేక హోదా ఇవ్వబోమని మొండిగా చెప్పడం వలన ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. ఇదివరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం, నాన్చుడు కారణంగా గోటితో పోయే సమస్య గొడ్డలి వరకు వెళ్ళినట్లే, ప్రత్యేక హోదా విషయంలో కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించుకొంటూ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈసమస్యను కూడా చొరవ తీసుకొని పరిష్కరించితే అందరికీ మేలు కలుగుతుంది.