పార్లమెంటు సమావేశాలకి- ప్రత్యేక హోదాకి ఎటువంటి అవినాభావ సంబంధం ఏర్పడిందో, ప్రత్యేక హోదాకి ఇద్దరు తెదేపా కేంద్రమంత్రుల రాజీనామాలకి కూడా అటువంటి బంధమే వేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ప్రత్యేక హోదా ఇవ్వనందున నిరసనగా వారిద్దరి చేత రాజీనామాలు చేయించి బయటకు రప్పించాలని డిమాండ్ చేస్తుంటారు. ఈరోజు కూడా మళ్ళీ అదే డిమాండ్ చేశారు. ఆయన ఆవిధంగా డిమాండ్ చేసినప్పుడల్లా తెదేపా నేతలు కూడా తమ వద్ద సిద్దంగా ఉన్న జవాబు చెపుతుంటారు. అదేమిటంటే, తమకి ఆ పదవులపై ఆశ లేదని, ప్రత్యేక హోదా వస్తుందంటే తక్షణమే రాజీనామాలు చేసేస్తామని చెపుతుంటారు. కానీ అది రాదు వారు చేయరు. తాము బయటకి వచ్చేసినంత మాత్రాన్న కేంద్రప్రభుత్వం పడిపోదని కూడా చెపుతుంటారు. అంటే తాము రాజీనామాలు చేయడం అనసవరం అని చెప్పకనే చెపుతున్నట్లు అర్ధం అవుతోంది.
అటువంటి పదవులపై తమకి ఆశ, మమకారం లేదని ఎవరైనా చెపితే అంతకంటే పచ్చి అబద్దం మరొకటి ఉండదు. వాటి కోసం రాజకీయ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో అందరికీ తెలుసు కనుక ఈ విషయంలో తెదేపా ఎంపిల మాటలతో ఏకీభవించలేము. కానీ వాటి వలన రాష్ట్రానికి మేలు కలుగుతుందనే వారి వాదన చాలా సహేతుకమైనదే.
ప్రధాని నరేంద్ర మోడీ ఏపికి ప్రత్యేక హోదా, తదితర హామీలని అమలుచేసినా చేయకపోయినా కేంద్రంలో రాష్ట్ర ప్రాతినిధ్యం కోసం వారు తమ పదవులలో కొనసాగడం చాలా అవసరం. వారు కేంద్రప్రభుత్వంలో ఉన్నందునే సహచర కేంద్రమంత్రులతో మాట్లాడి ఏపికి అవసరమైన సహాయ సహకారాలు సాధించగలుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మాట్లడగలుగుతున్నారు. వాళ్ళు తమ పదవులకి రాజీనామా చేసేసి బయటకి వచ్చేస్తే మనకి మనమే కేంద్రం తలుపులు మూసుకొని బయటకి వచ్చేసినట్లు అవుతుంది. ఆ పని కేంద్రం చేసి ఉంటే మన ఖర్మ అని సరిపెట్టుకోవచ్చు కానీ మనమే స్వయంగా తలుపులు మూసుకొని బయటకి రావడం చాలా అవివేకం అవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో కేంద్రప్రభుత్వంలో రాష్ట్రం తరపున ఇద్దరు మంత్రులు, పార్లమెంటులో ఎక్కువ మంది ఎంపిలు ఉండటం వలననే రాష్ట్ర సమస్యలని కొంత వరకైనా పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది. కనుక వారు రాజీనామాలు చేసి బయటకి వచ్చేయాలనే వైకాపా డిమాండ్ సరికాదు. అది రాజకీయ దుర్దేశ్యంతో చేస్తున్న డిమాండే కనుక దానిని పట్టించుకోనవసరం లేదు.