విశ్వక్రీడా వేడుక ఒలింపిక్స్ ఎప్పుడెప్పుడా అని క్రీడా ప్రపంచం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. క్రికెట్ పిచ్చి ఎక్కువైన భారత్ లోనూ ఒలింపిక్స్ పోటీలను తప్పకుండా చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఎటొచ్చీ, మన క్రీడాకారులు పతకాలు నెగ్గడమే చాలా తక్కువ. బ్రెజిల్ లోని రియో ఆగస్టు 5 నుంచి 21 వరకు ఒలింపిక్స్ పోటీలు కనువిందు చేయనున్నాయి.
స్వాతంత్ర్యానికి ముందు నుంచీ భారత్ ఈ క్రీడల్లో పాల్గొంటూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1984 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ తప్ప మిగతా అన్ని పోటీల్లో పాల్గొంది. 1984 ఒలింపిక్స్ ను సోవియట్ యూనియన్ మిత్రదేశాలు బహిష్కరించాయి. వాటిలో భారత్ ఒకటి.
ఒకప్పుడు హాకీలో భారత్ కు స్వర్ణం గ్యారంటీ. మరి ఈసారి జరుగుతుందో చూడాలి. ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకూ మొత్తం 38 పతకాలు మాత్రమే సాధించింది. హాకీలో 8 స్వర్ణ, ఒక రజత, రెండు కాంస్య పతకాలు గెల్చుకుంది. షూటింగ్ లో ఒక స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకం గెల్చుకుంది. రెజ్లింగ్ లో ఒక రజత, మూడు కాంస్య పతకాలు సాధించింది. అథ్లెటిక్స్ లో రెండు రజత, రెండు కాంస్య పతకాలు గెల్చుకుంది. బాక్సింగ్ లో రెండు రజత పతకాలు, బ్యాడ్మింటన్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లో ఒక్కో కాంస్య కాంస్య పతకం గెల్చుకుంది.
విశేషం ఏమిటంటే, అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్స్ ఒక్కడే 22 పతకాలు గెల్చుకున్నాడు. 2004, 2008, 2012 ఒలింపిక్స్ లో మొత్తం 18 స్వర్ణ, 2 రజత, 2 కాంస్య పతకాలు సాధించాడు. ఒక్క బీజింగ్ ఒలింపిక్స్ లోనే ఏకంగా 8 స్వర్ణ పతకాలు సాధించి ఆల్ టైం రికార్డు సృష్టించాడు.
అగ్రరాజ్యం అమెరికా ఇప్పటి వరకు 2,397 పతకాలు గెల్చుకుంది. ఇందులో 976 స్వర్ణ పతకాలున్నాయి. 756 రజత, 665 కాంస్య పతకాలున్నాయి. డ్రాగన్ దేశం చైనా ఒలింపిక్స్ లోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టింది. 1952 హెల్సింకీలో తొలిసారిగా ఆ దేశ అథ్లెటిక్స్ పోటీ పడ్డారు. ఆ తర్వాత చాలా కాలం చైనా ఒలింపిక్స్ లో పాల్గొనలేదు. 1984 నుంచి మాత్రం వరసగా పాల్గొంటోంది. అయినప్పటికీ, లండన్ ఒలింపిక్స్ వరకూ చైనా మొత్తం 473 పతకాలు గెల్చుకుంది. వీటిలో 201 స్వర్ణ, 146 రజత, 126 కాంస్య పతకాలున్నాయి. బీజింగ్ ఒలింపిక్స్ లో అమెరికాను వెనక్కి నెట్టి, చైనా టాప్ ర్యాంక్ సాధించింది. ఆ ఒక్క ఒలింపిక్స్ లోనే 51 స్వర్ణ, 21 రజత, 28 కాంస్య పతకాలు సాధించింది. మొత్తం 100 పతకాలతో సెంచరీ కొట్టింది.
భారత్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఆరు పతకాలు సాధించడం క్రీడాభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. లండన్ గేమ్స్ లో రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు భారత్ కు దక్కాయి. హైదరాబాదీ సంచలనం సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం గెల్చుకుంది. గగన్ నారంగ్ షూటింగ్ లో కాంస్య పతకం సాధించాడు. ఇద్దరు పిల్లల తల్లి మేరీ కోమ్ బాక్సింగ్ లో కాంస్య పతకం సాధించి సంచలనం సృష్టించారు.
ఈసారి భారతీయ క్రీడాకారులపై భారీ అంచనాలే ఉన్నాయి. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ఎలా ఉన్నా, రియో వెళ్లిన వాళ్లు పతకాలను సాధించడానికే ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో ఎక్కువ మంది విజయం సాధించాలని, భారత్ టాప్ ర్యాంక్ కాకపోయినా కనీసం టాప్ 10 లో ఉండాలని ఆశిద్దాం.