ముద్రగడ పద్మనాభం ఆగస్ట్ నెలాఖరులోగా మంజునాథ కమీషన్ నివేదికని తయారు చేసి, దానిని ప్రభుత్వం ఆమోదించి కేంద్ర అనుమతి కోసం పంపాలని లేకుంటే మళ్ళీ ఉద్యమించడానికి వెనుకాడనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని శనివారం హెచ్చరించారు.
ఈసారి అయన తుని విధ్వంసం, కేసుల గురించి చాలా భిన్నంగా స్పందించారు. తుని సభకి తనదే బాధ్యత కానీ విధ్వంసానికి కాదని, దానితో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం విశేషం. గతంలో అక్కడ జరిగిన సంఘటనలకి పూర్తి బాధ్యత తనదేనని కనుక పోలీసులు తననే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసేవారు. తుని విద్వంసం కేసులో అరెస్ట్ అయిన వారిని విడిపించుకోవడానికి దీక్ష మొదలుపెట్టే ముందు, దానికి తనదే బాధ్యత అని కనుక తనని అరెస్ట్ చేసి వారిని విడిచి పెట్టమని అమలాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆ విద్వంసం ఘటనలతో తనకి సంబంధం లేదని చెపుతున్నారు.
తన ఉద్యమాన్ని నీరు కార్చేందుకే తుని విద్వంసం కేసు పేరుతో పోలీసులు విచారణ, అరెస్టులు చేస్తూ అమాయకులని వేధిస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. ఆ విధ్వంసానికి తను కారకుడు కాదని చెప్పారు. అలాగే పోలీసులు అరెస్ట్ చేస్తున్న వారెవరూ కూడా కాదని వాదిస్తున్నారు. ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేస్తే తన ఉద్యమాన్ని నీరు కార్చడానికే ఆవిధంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఆనాడు రత్నాచల్ ఎక్స్ ప్రెస్, పోలీస్ వాహనాలని ఎవరు తగులబెట్టారు? దానికి ఎవరు బాధ్యులు? అనే ప్రశ్న అడిగితే చాలా మందికి ఆగ్రహం కలుగుతుంది.
కేసులకి భయపడి తన పోరాటాన్ని విరమించుకోనని, అలా చేస్తే కాపు జాతి క్షమించదని ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపులకి రిజర్వేషన్ల ఇచ్చే విషయం ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని ముద్రగడకి కూడా తెలుసు. ఆ హామీని ఇచ్చింది చంద్రబాబు నాయుడే గాబట్టి దానిని నిలబెట్టుకోవలసి బాధ్యత కూడా ఆయనదే. ముద్రగడ దీక్ష ఒత్తిడికి తలొగ్గి ఆయన మంజునాథ కమీషన్ వేసినప్పటికీ, అది ఇంతవరకు పని మొదలుపెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సర్వే నివేదిక కోసం ఎదురుచూస్తోంది. అది చేతికి అందిన తరువాత దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. ఆ సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి దానిని ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపాలి. దానిని కేంద్రం ఆమోదిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్లు ప్రకటించగలదు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమిడి ఉన్న ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాల సమయం పట్టవచ్చు. కేంద్రప్రభుత్వం ఇష్టపడకపోయినా, లేదా రాష్ట్ర ప్రభుత్వం సూచించినా దానిని అక్కడే తొక్కి పట్టి ఉంచగలదు.
గుజరాత్ లో పటేల్ కులస్తులకి రిజర్వేషన్లు కోరుతూ హార్దిక్ పటేల్ ఉద్యమించినప్పుడు, వారిలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ ప్రక్రియ రాష్ట్ర స్థాయిలోనే పూర్తయినట్లు సమాచారం. కనుక ఏపిలో కూడా అదేవిధంగా కాపులు అందరికీ కాకుండా వారిలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి మాత్రమే పరిమిత శాతం రిజర్వేషన్లు అమలుచేయాలనుకొంటే రాష్ట్ర స్థాయిలోనే ఈ ప్రక్రియ ముగించవచ్చు. కానీ అందుకు ముద్రగడ, కాపు నేతలు అంగీకరించవలసి ఉంటుంది. ఒకవేళ అందుకు అంగీకరించకపోతే, డిల్లీకి పంపిన ఆ ఫైలు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందో, అది ఆమోదానికి నోచుకొంటుందో లేదో ఎవరూ చెప్పలేరు.