భీమవరం ఎటకారం, గోదావరి చమత్కారం నిలువెల్లా పూసుకొన్న ఆకారం… సునీల్.
సునీల్ కనిపిస్తే చాలు.. నవ్వొచ్చేస్తుంది. మాట్లాడితే కితకితలు క్యూ కట్టేస్తాయి. అలా ఎన్ని సినిమాల్లోనో తెగ నవ్వించాడు. ఆ తరవాత హీరో అయ్యాడు. హీరో అయ్యాక సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడు. కండలు పెంచాడు. డాన్స్ లో స్పీడ్ చూపించాడు. స్టైల్ మార్చాడు. కానీ కామెడీనే మర్చిపోయాడు. దాంతో సునీల్‌కి వరుసగా పరాజయాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు జక్కన్నతో వినోదం పంచడానికి రెడీ అయ్యాడు. ఈ శుక్రవారం జక్కన్న థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా సునీల్ తెలుగు 360.కామ్‌తో చెప్పిన సంగతులు ఇవీ…
* జక్కన్న రిపోర్ట్ ఎలా ఉంది?
– చాలా బాగుందండీ. మేం ఎలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నామో అలాంటి సినిమానే తీశావ్ అని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇండ్రస్ట్రీ నుంచి కూడా చాలామంది ఫోన్లు చేసి ఇదే చెబుతున్నారు. తొలిరోజు రూ.3.5 కోట్లు వసూళ్లొచ్చాయి. ఇంత ఆదరణ ఊహించలేదు.
* కానీ రివ్యూలు మాత్రం వేరేలా ఉన్నాయి..
– నిజం చెప్పాలంటే ఇది రివ్యూల కోసం తీసిన సినిమా కాదు. ఏదో జస్ట్ టైమ్ పాస్ చేయిద్దామనుకొని తీసిన సినిమా. అయినా నేను కొన్ని రివ్యూలు చదివా. బాగానే ఉంది అని రాశారు..
* మీరు సినిమా చూశారా.. థియేటర్లో
– చూశారండీ. తెరపై ఏం జరుగుతుంది అనే కుతూహలం కంటే.. థియేటర్లో ఉన్న వాళ్ల స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తే ఎక్కువ ఉంది నాలో. నా ముందు సీట్లో అరవై ఏళ్ల బామ్మ.. ఓ కాలేజీ అమ్మాయి ఉన్నారు. జోక్ రాగానే.. వాళ్లవంక చూసేవాడ్ని. రియాక్షన్ ఎలా ఉందో ఏంటో అని. వాళ్లు సినిమా అయ్యేంత వరకూ నవ్వుతూనే ఉన్నారు. సక్సెస్ కొట్టేశామని అప్పుడే అనిపించింది.
* మీ గత సినిమాలు అనుకొన్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా ఇంత మంచి వసూళ్లు ఎలా దక్కాయంటారు?
– సునీల్ బ్యాక్ టూ ఎంటర్టైన్ అనే ట్యాగ్ లైన్ పెట్టాం కదా, వీడు ఎప్పటిలానే నవ్విస్తాడు అని జనాలకు నమ్మకం వచ్చుంటుంది. అందుకే తొలిరోజు థియేటర్లు హౌస్‌ఫుల్స్ అయ్యాయి.
* వరుస ఫ్లాపులు మిమ్మల్ని మార్చాయా?
– చాలా మార్చాయండీ. నా నుంచి జనం ఏం కోరుకొంటున్నారో అదే అందించాలని ఫిక్సయ్యా. ఇక నుంచి అలాంటి సినిమాలనే చేస్తా.
* అంటే ఫైటింగులకు దూరం అయినట్టేనా?
– అలాగేం కాదండీ. పనిగట్టుకొని ఫైట్ సీన్లు పెట్టను. సినిమాలో ఎమోషన్ వచ్చినప్పుడు కచ్చితంగా దాన్ని శాటిస్ఫై చేయాల్సిందే. అలాంటి ఫైట్లుంటే ఒప్పుకొంటా.
* ఇది వరకు రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి నటులు కామెడీ చేస్తూనే ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసేవాళ్లు. అలాంటి కథలు మీకు దొరడం లేదా?
– నిజంగానే ఆ టైపు కథలు ఇప్పుడు రావడం లేదండీ. నిజంగా వస్తే నా అంత అదృష్టవంతుడు ఉండడు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నేనో సినిమా చేస్తున్నా. అది రాజేంద్రప్రసాద్ సినిమాల్లానే ఉంటుంది. ప్రామిస్.
* చిరంజీవి 150వ సినిమాలో నటించే అవకాశం వస్తే ఒప్పుకోలేదట..
– అవునండీ. సరిగ్గా అప్పుడే జక్కన్న కోసం క్లైమాక్స్ తీస్తున్నాం. సరిగ్గా 50 మంది ఆర్టిస్టులతో నిండిన సీన్లు అవి. అవెప్పుడో షెడ్యూల్ అయిపోయాయి. అందుకే కుదర్లేదు. అయితే ఇప్పుడు అన్నయ్య సినిమలో నాకు మళ్లీ ఛాన్స్ వచ్చింది. వినాయక్ గారు.. ఓ పాత్రలో నటించమని అడిగారు. ఈసారి ఛాన్స్ మిస్ అవ్వను.
* త్రివిక్రమ్‌తో సినిమా ఎప్పుడు?
– తప్పకుండా ఉంటుందండీ. తనకు కాస్త గ్యాప్ దొరికితే నాతో సినిమా చేయడానికి రెడీ. అదెప్పుడు దొరుకుతుందో చూడాలి. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి జీవితాంతం ఎదురుచూడమన్నా చూస్తా.
* సీరియస్ సబ్జెక్ట్స్ మీ దగ్గరకు వస్తే..?
– అస్సలు చేయనండీ. నన్ను ఆ టైపు పాత్రల్లో చూడలేరు. బిచ్చగాడు కథ నన్ను చేయమన్నారు. నిజంగా ఆసినిమా నేను చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యేది.
* వీడు గోల్డెహె.. ఎంత వరకూ వచ్చింది?
– టాకీ పూర్తయ్యింది. నెలరోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈమధ్య నాకు బాగా గ్యాప్ వచ్చింది. ఇక మీదట అలా విరామం తీసుకోకూడదని డిసైడ్ అయ్యా. అందుకే ఈ యేడాది నానుంచి ఇప్పటి వరకూ రెండు సినిమాలొచ్చాయి. మూడో సినిమా కూడా రెడీ అయిపోతోంది.