ప్రభుత్వం ఏ సమాచారమైనా ప్రజలకు నేరుగా ఇవ్వాలి. అది బాధ్యత. ఒక్కోసారి సమాచారం లాంటి దాన్ని లీక్ చేయడం కొత్త పద్ధతి. ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, అది వివాదాస్పదం అవుతుందనే అనుమానం ఉంటే మీడియాకు లీకులు ఇస్తుంటాయి. ఆ వార్తలపై ప్రజల్లో స్పందన ఏమిటో గమనిస్తుంటాయి. ఇది ముఖ్యమంత్రే ఇవ్వవచ్చు. మంత్రులు లేదా అధికారులూ ఇవ్వవచ్చు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి కొత్త భవనం కడతారనే లీకు వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ భవనాన్ని కట్టాలని నిర్ణయించిందనే లీకు వార్త ఆదివారం వ్యాప్తిలోకి వచ్చింది. అదే స్థలంలో మండలి భవనాన్ని కూడా నిర్మిస్తారట. జలసౌధ భవనాన్ని, ఆర్ అండ్ బి భవనాన్ని కూల్చేసి అసెంబ్లీ కట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోందన్నది ఈ కథనం సారాంశం. ఇప్పుడున్న భవనానికి ఏం సమస్యో తెలియదు. చక్కగా ఉంది. మరికొన్ని దశాబ్దాల పాటు హాయిగా అందులోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అయినా కొత్త భవనాన్ని కట్టాలనే యోచన వచ్చిందట. ఇంతకీ సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకుంటారా లేక ప్రతిస్పందన చూసిన తర్వాతే ఏ సంగతీ ఆలోచిస్తారా అనేది తెలియదు.
ఇప్పటికే సచివాలయ భవనం పేరుతో ఓ టౌన్ షిప్ లాంటి నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధపడింది. భారీ ప్రణాళిక కూడా చేస్తోంది. ఢిల్లీ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ తరహాలో అత్యాధునిక భవంతుల నిర్మాణానికి సిద్ధమవుతోంది. అయితే వీటన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేదే ప్రశ్న.
ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో చేయలేకపోతోంది. ఆర్టీసీ కార్మికులు బకాయిల కోసం ఇటీవల సమ్మెకు సిద్ధపడ్డారు. కనీసం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపో వడంతో ఈమధ్యే రెండు సార్లు ప్రయివేట్ ఆస్పత్రులు ఈ సేవలను నిలిపివేసి ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో, ఉన్న భవనాలను కూల్చి కొత్త భవనాలు కట్టడానికి నిధులు ఎలా వస్తాయో మరి.