ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ నిన్న మరొకమారు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన, ఆ కారణంగా రాష్ట్ర దుస్థితి, ప్రత్యేక హోదాతో సహా హామీల అమలులో కేంద్ర అశ్రద్ద, వైఫల్యం, ఆ సాకుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు, విమర్శలు వగైరా అందరికీ తెలిసిన విషయాల గురించి మాట్లాడిన తరువాత, చివరి ప్రయత్నంగా తాము మరొక్కసారి ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితులు, సమస్యలు వివరించి హామీల అమలుకోసం గట్టిగా అడుగుతామని, అప్పటికీ ప్రధాని వైఖరిలో మార్పు రాకపోతే ‘తదుపరి కార్యాచరణ’ కి సిద్దం అవుతామని కేంద్రానికి మీడియా ద్వారా బహిరంగ హెచ్చరిక చేశారు.
ప్రత్యేక హోదా, రైల్వేజోన్ తదితర హామీలని కేంద్రప్రభుత్వం అమలుచేయదని చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో తెలుసు. కేంద్రప్రభుత్వం కూడా ఆ విషయం చాలాసార్లు స్పష్టం చేస్తూనే ఉంది. అయినా ఇంతకాలం చంద్రబాబు నాయుడు ఇంత గట్టిగా అడగలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు? భాజపాతో తెగతెంపులు చేసుకొంటే కేంద్రప్రభుత్వ సహాయసహకారాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది కనుకనే అటువంటి ఆలోచనలు చేయడం లేదని చెప్పిన చంద్రబాబు, ఆ సంగతి తెలిసి ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? అనే సందేహాలకి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
ప్రధాని మోడీ పట్ల చంద్రబాబు ఎంత వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నప్పటికీ, అయన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఇప్పటికే దాదాపు రెండున్నరేళ్ళు పూర్తయిపోయాయి. నేటికీ ఆయన తన హమీలు అమలుచేయకపోవడమే కాకుండా వాటిని అమలుచేయమని తెగేసి చెప్పడం ప్రజలు కూడా చూస్తున్నారు.
కేంద్ర సహాయ సహకారాలు అవసరమనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోడీ పట్ల చంద్రబాబు వినయవిధేయతలు ప్రదర్శిస్తుంటే, దానికి జగన్ వేరే అర్ధం, కారణాలు చెపుతూ తెదేపాకి నష్టం కలిగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసులకి భయపడి కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని, వాటి కోసం చివరికి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదని ప్రచారం చేస్తున్నారు.
ఏపికి ఇచ్చిన హామీలని అమలుచేయ(లే)మని కేంద్రప్రభుత్వం అంత స్పష్టంగా చెపుతున్నప్పటికీ, ఇంకా దానిని గట్టిగా నిలదీసి అడగడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? దానితో ఎందుకు కలిసి సాగుతున్నారు? అని ప్రశ్నిస్తున్న జగన్ పై తెదేపా నేతలు ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు కానీ జగన్ చేస్తున్న ఆ ప్రచారం రాష్ట్ర ప్రజలని ఆలోచింపజేసి, ప్రభావితం చేయవచ్చని తెదేపాకి కూడా తెలుసు.
తెదేపాకి కేవలం రెండున్నరేళ్ళు సమయం మాత్రమే మిగిలి ఉంది. కనుక వైకాపాని ధీటుగా ఎదుర్కోవాలంటే, ఇక భాజపాతో తెగతెంపులు చేసుకొని కేంద్రాన్ని గట్టిగా ఎదుర్కోవడమే ఏకైక మార్గం. తద్వారా వైకాపా, ప్రతిపక్షాల నోరు మూయించడమే కాకుండా, తిరిగి ప్రజల సానుభూతిని పొందవచ్చు. వారి ఆగ్రహాన్ని కేంద్రంపైకి, భాజపాపైకి మళ్ళించవచ్చు. అప్పుడు భాజపాతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్న వైకాపా కూడా దానికి దూరంగా ఉండక తప్పదు. అప్పుడు రాష్ర్టంలో భాజపా ఒంటరి అయిపోతుంది. మోడీ పట్ల వినయంగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎలాగూ సహాయం అందకపోవడం వలన రాష్ట్రానికి నష్టం జరుగుతూనే ఉంది. కనుక భాజపాతో తెగతెంపులు చేసుకోవడం వలన కొత్తగా జరిగే నష్టమేమీ ఉండదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు అటువంటి ఆలోచన చేస్తున్నట్లు భావించవచ్చు.
కానీ చంద్రబాబు నిజంగానే భాజపాతో తెగతెంపులు చేసుకొంటారా? భాజపా కూడా అందుకు సిద్దపడుతుందా?అంటే అనుమానమే. ఏమి జరుగుతుందో త్వరలోనే తేలిపోతుంది.