రెండేళ్ళ క్రితం యూపియే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా పార్లమెంటు తలుపులు మూసి విభజన బిల్లు అందిస్తే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే పార్లమెంటులో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి విభజన చట్టం అనుమతించడం లేదని తప్పించుకొంటోంది. ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, దానిలో తన పార్టీని కూడా పణంగా పెట్టి రాష్ట్ర విభజన చేస్తే, ఇప్పుడు భాజపా అధిష్టానం కూడా ప్రత్యేక హోదా తదితర హామీల విషయంలో రాష్ట్రాన్ని, దానిలో తన పార్టీని పణంగా పెట్టేందుకు సిద్దపడుతున్నట్లే కనబడుతోంది. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సబందించినంత వరకు అది కాంగ్రెస్ అడుగు జాడలలోనే నడుస్తోంది. కనుక దానికీ రాష్ట్రంలో అదే గతి పట్టవచ్చు.
ఒకవేళ తెదేపా దానితో బంధం తెంచుకొన్నట్లయితే, రాష్ట్రంలో భాజపా పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కంటే అద్వానంగా మారవచ్చు. ఎందుకంటే హామీలని అమలుచేయనందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు దానిపై ఆగ్రహంగా ఉన్నారు. వారితో ఇప్పుడు తెదేపా కూడా గొంతు కలిపినట్లయితే రాష్ట్రంలో భాజపా ఒంటరిదైపోతుంది. దానితో చేతులు కలపాలని ఇంతవరకు వైకాపా ఉవ్విళ్ళూరినప్పటికీ, మారిన పరిస్థితులలో దానితో చేతులు కలిపితే ప్రజాగ్రహానికి గురి కావలసివస్తుందనే భయంతో భాజపాతో చేతులు కలపడానికి ఇష్టపడకపోవచ్చు. కలిపితే అదీ నష్ట పోయే ప్రమాదం ఉంది.
ఒకవేళ వైకాపా, భాజపాలు చేతులు కలిపితే అప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. హామీలు అమలుచేయనందుకు నిరసనగా ఇద్దరు కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయించాలని, భాజపాతో తెగతెంపులు చేసుకోవాలని ఇంతవరకు వైకాపా తెదేపాని డిమాండ్ చేస్తోంది. కనుక ఒకవేళ ఇప్పుడు అది భాజపాతో చేతులు కలిపితే, ‘ఇంతకాలం మాకు సుద్దులు చెప్పి ఇప్పుడు భాజపాతో మీరెందుకు చేతులు కలిపారని?’ తెదేపా ప్రశ్నించడం, విమర్శించడం తధ్యం. అంతే కాదు కేంద్రప్రభుత్వం చేత ఆ హామీలని అమలుచేయించమని తెదేపాయే వైకాపా మీద ఒత్తిడి చేయడం మొదలుపెడుతుంది.
కనుక, ఒకవేళ భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొన్నట్లయితే, ఇప్పటికిప్పుడు వైకాపా దానితో జత కట్టే ప్రయత్నం చేయకపోవచ్చు. ఎన్నికల సమయంలో పరిస్థితులని బట్టి చేతులు కలిపితే కలుపవచ్చు. అంతవరకు భాజపాతో, కేంద్రప్రభుత్వంతో వైకాపా ఎప్పటిలాగే కొంచెం మెతకగా వ్యవహరించవచ్చు. కనుక ఒకవేళ భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొన్నట్లయితే మరో రెండేళ్ళు రాష్ట్ర భాజపా నేతలకి ఎదురీత తప్పదు. అప్పటికైనా భాజపా అధిష్టానం సరైన వ్యూహం అమలు చేస్తే వారు ఒడ్డున పడతారు లేకుంటే రాష్ట్ర కాంగ్రెస్ నేతలలాగే తీవ్రంగా నష్టపోవచ్చు. అదే జరిగితే ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు భాజపా అధిష్టానం తమ రాష్ట్ర పార్టీని, నేతల రాజకీయ భవిష్యత్ ని పణంగా పెటినట్లవుతుంది.