ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటులో తెదేపా, వైకాపా ఎంపిలు ఆందోళన చేశారు. ముందే ప్రకటించిన విధంగా ఈరోజు తెదేపా ఎంపిలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా కూడా చేస్తున్నారు. కానీ వారితో వైకాపా ఎంపిలు ఎవరూ కలువలేదు ఆ రెండు రాజకీయ ప్రత్యర్ధులు కనుక అవి ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నప్పటికీ కలవకపోవడం సహజమేనని సరిబెట్టుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, ప్రత్యేక హోదా కోరుతూ రేపు రాష్ట్ర బంద్ కి వైకాపా పిలుపునివ్వగా, బంద్ కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ఉద్యమిస్తుంటే, అధికార పార్టీ డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్ళెదుట పోరాడుతుండటం విశేషం.
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొన్న రాష్ట్ర బంద్ కి పిలుపునిస్తూ, “ప్రత్యేక హోదా అనేది కేవలం ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే. అది లెజిస్లేటివ్ కానే కాదు. కనుక దానిపై కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే నిర్ణయం తీసుకోగలరు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కూడా ఒకే ఒక సంతకంతో ఉత్తరాఖండ్ కి ప్రత్యేక హోదా మంజూరు చేశారు. కనుక ఇప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకొంటే దానిని ప్రభుత్వం తప్పనిసరిగా అమలుచేయవలసిందే,” అని చెప్పారు.
ప్రత్యేక హోదా మంజూరు చేసే అధికారం కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని జగన్ స్వయంగా చెపుతునప్పుడు, డిల్లీ వెళ్లి అక్కడ ధర్నాలు చేయకుండా రాష్ట్రంలో ధర్నాలు, బంద్ లు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడుతో సహా అందరూ తనతో కలిసి రావాలని కోరుతున్నప్పుడు, పార్లమెంటు ఆవరణలో తెదేపా ఎంపిలకి వైకాపా ఎంపిలు సంఘీభావం ఎందుకు ప్రకటించరు? దాని కోసం ప్రధాని మోడీని నిలదీయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎందుకు దూషిస్తున్నారు? అంటే ప్రత్యేక హోదా పేరుతో బంద్ నిర్వహించి వైకాపా బలప్రదర్శన చేయడం కోసం, ఆ పేరుతో రాజకీయ మైలేజ్ పొందాలనే తాపత్రయంతోనే అని భావించక తప్పదు.
రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నందున, తెదేపా-భాజపాలు మిత్రపక్షాలుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నందునే, ఇంతకాలంగ అది ప్రతిపక్షపార్టీలలాగ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, బంద్ లు చేయలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ప్రత్యేక హోదా తదితర హామీలని అమలుచేయమని చాలా సార్లు విజ్ఞప్తి చేశారు. అదే పద్ధతి కూడా. కానీ ఇప్పుడు ఆ మొహమాటాలని కూడా పక్కనబెట్టేసి పార్లమెంటు లోపల, బయట తెదేపా ఎంపిలు పోరాడుతున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరిని మహాత్ముని సాక్షిగా తెదేపా ఎంపిలు ఎండగడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని, భాజపా అధిష్టాన్ని వారంతా నేరుగా ప్రశ్నిస్తున్నారు. మాట తప్పితే ఊరుకోమని గట్టిగా హెచ్చరిస్తున్నారు కూడా. కనుక వారు చేస్తున్న ధర్నాలు, హెచ్చరికలతో మోడీ ప్రభుత్వంలో ఏమైనా కదలిక వస్తే రావచ్చునని ఆశించవచ్చు.
కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న బంద్ ని కేంద్రప్రభుత్వం పట్టించుకాదని అందరికీ తెలుసు. దాని వలన కాంగ్రెస్, వైకాపాలకి ఏమైనా లాభం ఉంటుందేమో గానీ రాష్ట్రానికి ఇంకా నష్టమే తప్ప ఏమాత్రం లాభం కలుగదు. కనుక కాంగ్రెస్, వైకాపాలకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, డిల్లీలో ఈ ధర్నాలు నిర్వహించి, కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. తమ రాజకీయ విభేదాలని పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసి డిల్లీలో పోరాడాలి. అప్పుడే ఏమైనా ప్రయోజనం ఉంటుంది.